
బీజేపీ, కాంగ్రెస్‌లపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలపై సెటైర్లు వేశారు. నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటినస్తున్న మంత్రి కేటీఆర్.. గీసుకొండ మండలం హవేలీలోని కాకతీయ మెగా టైక్స్‌టైల్ పార్కులో ఏర్పాటు చేస్తున్న కైటెక్స్ టెక్స్‌టైల్ పరిశ్రమకు భూమిపూజ చేశారు. రూ.1200 కోట్లు పెట్టుబడితో ఏర్పాటుచేయనున్న ఈ సంస్థలో 11,100 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన కేటీఆర్ తెలంగాణ అభివృద్దిలో దూసుకుపోతుందని చెప్పారు.
పొలిటికల్ టూరిస్ట్‌లు రోజుకోకరు వస్తున్నారని ఎద్దేవా చేశారు. మొన్న ఒకరు మహబూబ్ నగర్‌కు వచ్చారని.. నిన్న ఒకరు వరంగల్‌కు వచ్చారని చెప్పారు. నిన్న వరంగల్ కొచ్చిన వ్యక్తి కాంగ్రెస్ వాళ్లు రాసింది.. చదివి వెళ్లారని విమర్శించారు. ఆయనకు వడ్లు తెల్వదు.. ఎడ్లు తెల్వదు అని ఎద్దేవా చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కంటే మెరుగైన పరిస్థితులు ఉన్నాయా అని ప్రశ్నించారు. మెరుగైన పరిస్థితి లేదు కాబట్టే.. అవార్డులు రావడం లేదన్నారు. ఎవరెవరో వస్తారు.. మాట్లాడతారు.. హైదరాబాద్‌కు వచ్చి ధమ్ బిర్యానీ తిని పోతారని ఎద్దేవా చేశారు. వాళ్ల గురించి నెత్తి కరాబు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు చెప్పుకుంటే సరిపోతుందన్నారు.
నోటికొచ్చినట్టుగా విమర్శలు చేసి.. డైలాగులు కొడతారని.. కానీ వాళ్లతోనే అయ్యేది లేదు పోయేది లేదని విమర్శించారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ టీపీసీసీ, టీబీజేపీ ఉండేదా.. ఈ నేతలకు పదవులు వచ్చేవా అని ప్రశ్నించారు.