కేసీఆర్ ను గద్దెదించాలని వాళ్ళిద్దరి ప్లాన్:బయటపెట్టిన కేటీఆర్

By Nagaraju TFirst Published Nov 3, 2018, 2:59 PM IST
Highlights

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడులు కుట్రపన్నుతున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. 40ఏళ్లపాటు కొట్లాడిన కాంగ్రెస్ టీడీపీలు ఏకమయ్యాయని ఎద్దేవా చేశారు. 

మహబూబాబాద్‌ : తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడులు కుట్రపన్నుతున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. 40ఏళ్లపాటు కొట్లాడిన కాంగ్రెస్ టీడీపీలు ఏకమయ్యాయని ఎద్దేవా చేశారు. మహబూబాబాద్‌లోని ఎన్టీఆర్‌ మైదానంలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ టీడీపీలపై విరుచుకుపడ్డారు. 

ఇటీవలే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసిన చంద్రబాబు నాయుడు కేసీఆర్ ను గద్దె దించాలని కోరారని ఆరోపించారు. కేసీఆర్ ను ఎందుకు గద్దెదించాలని చంద్రబాబును నిలదీయ్యాల్సిన అవసరం వచ్చిందన్నారు. దేశంలో ఏ సీఎం చెయ్యని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నందుకా 70 ఏళ్లలో చెయ్యని పనలు నాలగున్నరేళ్లలో చేసినందుకు గద్దె దించాలా అని ప్రశ్నించారు. 

కేసీఆర్ ను ఎందుకు గద్దె దించాలో ఒక్కకారణం చెప్పాలని కేటీఆర్ సవాల్ విసిరారు. ఇకపోతే మహబూబాబాద్‌లో అపారమైన ఇనుప గనులు ఉన్నాయన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమపై ప్రజలు కన్న కలలను తాము నెరవేరుస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. కేంద్రం స్పష్టత ఇవ్వకున్నా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి తీరుతామని హామీ ఇచ్చారు.  

నాలుగేళ్లలో ఏనాడు ప్రజలకు కనీసం ముఖం కూడా చూపించని కాంగ్రెస్, టీడీపీ నేతలు ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి వస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.  

click me!