తెలంగాణలో ఆంధ్రా వార్తలు ఎందుకు..? కేటీఆర్

By ramya neerukondaFirst Published Jan 23, 2019, 3:55 PM IST
Highlights

తెలంగాణ ఎడిషన్ లో ఆంధ్రా వార్తలు ఎందుకు రాస్తున్నారని తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్  ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. 


తెలంగాణ ఎడిషన్ లో ఆంధ్రా వార్తలు ఎందుకు రాస్తున్నారని తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్  ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. బుధవారం జర్నలిస్టు, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ను తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో కేటీఆర్ అభినందించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కొన్ని పత్రికలు మేం ఏంచేసినా కరెక్ట్ అన్నట్లు ఫీలౌతున్నారన్నారు. ఇప్పటికీ తెలంగాణపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అస్థిత్వాన్ని చాటుకునే దిశగా పోరాటం చేసి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. పొద్దున లేస్తే.. ఇక్కడ అమరావతి వార్తలు వేస్తున్నారని.. మరి అక్కడ తెలంగాణ వార్తలు వేస్తున్నారా? అని ప్రశ్నించారు.

తాను ఒకసారి ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడ కొన్ని పత్రికలు చూస్తే.. అసలు తెలంగాణ వార్తలు లేవని చెప్పారు. దేశంలో మా రాష్ట్రం లేదా అని తాను  అడిగితే.. అది ఆంధ్రా ఎఢిషన్ అని చెప్పారని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆంధ్రా ఎడిషన్ లో తెలంగాణ వార్తలు లేనప్పుడు.. తెలంగాణ ఎడిషన్ లో ఆంధ్రా వార్తలు ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు. 

దీనిపై జర్నలిస్టులు అంతా ఆలోచించుకోవాలి అని అన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి మాట్లాడితే కొందరికి కోపాలు వస్తాయన్నారు. తెలంగాణ భావజాలాన్ని అణువణువునా నింపుకున్న తెలంగాణ పత్రికలను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడి ఐదేళ్లు అవుతున్నప్పటికీ తెలంగాణ వాదాన్ని, అస్థిత్వాన్ని తొక్కిపెడుతున్న ధిక్కార ధోరణి పోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. మేమే అధిపత్యం చేస్తాం.. మేం చెప్పిందే వినాలి అనే డ్రామాలు ఇక నుంచి నడవవు అని స్పష్టం చేశారు. తెలంగాణ పత్రికలు, మాధ్యమాలకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు.

click me!