
హైదరాబాద్‌లో డుబల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో నలుగురి నుంచి రూ. 4.6 లక్షలు వసూలు చేశాడు. వివరాలు.. నిందితుడు బొమ్మిడం కుమార్‌బాబు తనను తెలంగాణ హౌసింగ్ బోర్డులో ఉద్యోగిగా బాధితులకు పరిచయం చేసుకున్నాడు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని బాధితులకు మాయ మాటలు చెప్పి నమ్మించాడు. అతని మాటలు నమ్మి బాధితులు అతనికి డబ్బులు కూడా చెల్లించారు.
అయితే బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసిన కుమార్ బాబు.. వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అలాట్ అయినట్టుగా ఫేక్ లెటర్, రశీదులు అందించారు. అయితే తర్వాత తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేపీహెచ్‌బీ పోలీసులు నిందితుడు కుమార్‌బాబును అరెస్ట్ చేశారు.
అయితే బొమ్మిడం కుమార్ బాబు గతంలో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడ్డాడు. ఏపీలో ప్రకాశం జిల్లాకు చెందిన బొమ్మిడం కుమార్‌బాబు.. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని అమాయకులను మోసం చేస్తున్నాడు. ఇందుకు సంబంధించి గతంలో కూడా అతడిని పోలీసులు అరెస్ట్ చేశాడు. కుమార్ బాబు.. ప్రశాంత్ రెడ్డి, రమేష్ పేర్లతో కూడా చలామణి అవుతున్నాడు. అయితే ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.