
పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై కొండా దంపతులు స్పందించారు. కూతురు పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. వరంగల్ తూర్పులో (warangal east) కొండా సురేఖ (konda surekha) బరిలో ఉంటుంది .. మరో సీటు ఇస్తే. మా కుటుంబంలో ఇద్దరం రెడీగా ఉన్నామని మురళీ (konda murali) అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో స్థానంలో కాంగ్రెస్‌కి కష్టంగా ఉన్న స్థానంలో పోటీలోకి దిగేందుకు కూడా రెడీనే అని ఆయన స్పష్టం చేశారు. తాము పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారం అవాస్తవమైన వాటిని నమ్మవద్దని కొండా దంపతులు స్పష్టం చేశారు .
ప్రజలను అయోమయానికి గురిచేయవద్దని విజ్ఞప్తి చేశారు. తాము వేరే పార్టీలోకి వెళ్లడం లేదని తాము నమ్ముకున్న కాంగ్రెస్ జెండా (congress party) కిందనే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని పేర్కొన్నారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే అధికార పార్టీ నాయకులు చేసే నీచ రాజకీయాలను నమ్మవద్దని కొండా మురళి వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఒక్క వరంగల్ తూర్పు నియోజకవర్గం మాత్రమే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా వుంటామన్నారు.
కాగా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయంగా కొండా దంపతులకు ఛారిష్మా ఉంది. మంత్రిగా కొండా సురేఖ, ఎమ్మెల్సీగా కొండా మురళీధర్ రావు సేవలందించారు. ప్రజల మధ్య గడిపిన చరిత్ర వారిది. సామాన్యులు, కార్యకర్తలకు ఆపద వస్తే అండగా నిలుస్తారనే పేరుంది. వరంగల్ తూర్పు, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లో వీరికి కొంత పట్టుంది. గతంలో వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన కొండా సురేఖ భారీ మెజార్టీతో గెలుపొందారు.
ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పార్టీ వీడాల్సి వచ్చింది. అనంతరం కాంగ్రెస్ గూటికి చేరి తూర్పును వదిలి పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అక్కడ పరాజయం పాలైన అనంతరం పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కొద్దినెలల క్రితం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగగా.. కొండా దంపతుల హవా ఎక్కడా కనిపించలేదు. తూర్పు నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలుచుకోలేదంటే కొండా దంపతుల ప్రాబల్యం ఏ స్థాయికి దిగజారిందో తెలుసుకోవచ్చు.