కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఎమ్మెల్యేగా గుర్తించిన సీఎం కేసీఆర్

First Published May 23, 2018, 4:09 PM IST
Highlights

శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాసిన సీఎం 

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండదని మరోసారి రుజువయ్యింది. ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ వేదికగా కొట్టుకున్నంత పని చేసిన నాయకులు ఇపుడు ఒక్కటయ్యారు. సమావేశాల సందర్భంగా జరిగిన గొడవ కారణంగా ఎమ్మెల్యే పదవినుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన కోర్టును ఆశ్రయించి మళ్లీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

ఈ గొడవలను పక్కనపెడితే ఇవాళ కోమటిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే కేసీఆర్ తనకు రాసిన లేఖపై కోమటిరెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. లేఖలో తనను నల్గోండ ఎమ్మెల్యేగా పేర్కొన్న సీఎం..  ఎమ్మెల్యేగా అధికారాలు, ప్రోటోకాల్, భద్రత, ఇతర సౌకర్యాలు పునరుద్దరించడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు.    

కేసీఆర్ తనకు శుభాకాంక్షలు తెలుపుతూ పంపిన లేఖను కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బైటపెట్టారు. ‘‘మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను’’. అని లేఖలో సీఎం పేర్కొన్నారు. అయితే చివరగా కోమటి రెడ్డి పేరును రాసి దాని కింద నల్గొండ ఎమ్మెల్యే అని రాసి ఉంది. దీంతో ఇలా లేఖలోనే కాకుండా నిజంగా కూడా తనను ఎమ్మెల్యేగా గుర్తించాలని
కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.

అయితే ఈ విషయాలన్నీ పక్కనపెడితే తన పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ కు కోమటిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
 
  

 
 
 
 
 
 


 
 

click me!