
తనపై తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (gutta sukender reddy) చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (komatireddy rajagopal reddy ) స్పందించారు. గుత్తా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే.. తీవ్ర పరిణామాలు తప్పవని రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. పదవుల కోసం , డబ్బు కోసం తాను పార్టీ మారలేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీలు, కండువాలు మార్చిన చరిత్ర గుత్తా సుఖేందర్ రెడ్డిదని కోమటిరెడ్డి చురకలు వేశారు.
అంతకుముందు మంగళవారం గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... కాంట్రాక్టుల కోసం రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా బీజేపీకి అవసరం అని అన్నారు. ఆ పార్టీ ఒత్తిడి వల్లే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని చెప్పుకొచ్చారు. బీజేపీ పార్టీలో రాజగోపాల్ రెడ్డి ఇమడలేరని, మునుగోడు ఎన్నికల్లో (munugode bypoll) మునగడం ఖాయం అని స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో గెలవనని రాజగోపాల్ రెడ్డికి కూడా తెలుసు అన్నారు. మునుగోడులో పోటీ చేయాలని ఎవరూ తనను అడగలేదని.. అలా అడిగితే ఆలోచిస్తానని అన్నారు. ప్రస్తుతానికి సంతృప్తిగా ఉన్నట్లు గుత్తా సఖేందర్ రెడ్డి తెలిపారు.
Also Read:రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఇమడడం కష్టమే.. గుత్తా సుఖేందర్ రెడ్డి
ఇదిలా ఉండగా, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ సంగతి తెలిసిందే.. దీనికి సంబంధించిన రాజీనామా లేఖను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం నాడు శాసనసభ స్పీకర్ అయిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి స్వయంగా కలిసి అందజేశారు. రాజీనామా లేఖ అందడం, దాన్ని ఆమోదించడం నిమిషాల్లో జరిగిపోయాయి. రాజీనామా లేఖను ఇచ్చిన కొన్ని నిమిషాల్లోనే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజీనామాను ఆమోదించారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమోదించిన నేపథ్యంలో.. మునుగోడు శాసనసభ స్థానం ఖాళీ అయ్యింది. దీని మీద త్వరలోనే ఎన్నికల సంఘానికి స్పీకర్ కార్యాలయం సమాచారం ఇవ్వనుంది. దీంతో నిబంధనల ప్రకారం మునుగోడు శాసన సభ స్థానానికి ఆరు నెలల్లోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. మరి దీనిపై ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.