కుబేరుడు రాజగోపాల్ రెడ్డే..మొత్తం అభ్యర్థుల్లో అగ్రస్థానం

By sivanagaprasad kodatiFirst Published Nov 20, 2018, 11:25 AM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో పోటీ చేస్తున్న అభ్యర్ఠుల అందరిలోకి అత్యంత సంపన్నుడైన వ్యక్తిగా కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిలిచారు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో పోటీ చేస్తున్న అభ్యర్ఠుల అందరిలోకి అత్యంత సంపన్నుడైన వ్యక్తిగా కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిలిచారు. నామినేషన్ల దాఖలుకు నిన్నటితో గడువు ముగిసిన తర్వాత.. అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లను పరిశీలించగా.. వారి ఆస్తులు, అప్పులు బయటకు తెలిశాయి.

నల్గొండ జిల్లా మునుగోడు నుంచి ప్రజాకూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన మొత్తం ఆస్తులు రూ.366 కోట్లు. వీటిలో చరాస్తులు రూ.266 కోట్లు కాగా.. స్థిరాస్తుల విలువ రూ.100 కోట్లు. ఇక ఆ తర్వాతి స్థానంలో నాగర్‌కర్నూలుకు చెందిన టీఆర్ఎస్ నేత మర్రి జనార్థన్ రెడ్డి నిలిచారు.

మర్రి కుటుంబసభ్యుల ఉమ్మడి ఆస్తి విలువ రూ.159 కోట్లు.. ఆ తర్వాత వరుసగా..శేరిలింగంపల్లి బీజేపీ అభ్యర్థి యోగానంద్ రూ..147 కోట్ల ఆస్తులతో పాటు 6 కిలోల బంగారం ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపారు. ఖమ్మం ప్రజా కూటమి అభ్యర్థి నామా నాగేశ్వరరావు రూ.141 కోట్ల ఆస్తులు.. 2.9 కిలోల బంగారం.

సనత్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆస్తుల విలువ రూ.76 కోట్లు.. వీటిలో ఆయన సొంతంగా సంపాదించిన ఆస్తుల విలువ రూ.40.34 కోట్లు. ఖమ్మం జిల్లా పాలేరు ప్రజాకూటమి అభ్యర్థి కె.ఉపేందర్ రెడ్డి ఆస్తుల విలువ రూ.72 కోట్లు.. ఇందులో షేర్లు, బాండ్ల రూపంలోనే దాదాపు రూ.71 కోట్లు ఉన్నాయి.

వనపర్తి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కొత్త అమరేందర్‌రెడ్డి ఆస్తులు రూ.63 కోట్లు. నారాయణపేట టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాజేందర్‌రెడ్డి ఆస్తులు 57.93 కోట్లు. ఉప్పల్‌ టీడీపీ అభ్యర్థి వీరేందర్‌ గౌడ్‌కు 57.31 కోట్ల ఆస్తులున్నాయి.

ప్రజా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొత్తకోట దయాకర్‌రెడ్డి(మక్తల్‌) ఆస్తులు 43 కోట్లు. ఖైరతాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌కు రూ.41.02 కోట్ల ఆస్తులున్నాయి. ఇందులో 7కోట్ల విలువైన బంగారం, వజ్రాలు ఉన్నాయి. ఇక నాగార్జునసాగర్ నుంచి ప్రజాకూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి పైసా అప్పు లేదు. బంగారం లేదు.. తన పేరిట రూ. 3,32,09,364 విలువైన స్థిర, చరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు.
 

click me!
Last Updated Nov 20, 2018, 11:25 AM IST
click me!