
కాకతీయ మెడికల్ కాలేజ్‌లో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ప్రీతి ఆత్మహత్య చేసుకోలేదని ఆమె తండ్రి నరేందర్ అంటున్నారు. తన కూతురును సైఫ్ చంపేశాడని ఆరోపిస్తున్నారు. సైఫ్ ఇంజక్షన్ ఇచ్చి దారుణానికి పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగిన రోజునే ప్రీతి బతకదని అనుకున్నట్టుగా చెప్పారు. అయితే చికిత్స పేరుతో తమను మభ్య పెట్టిందని తెలిపారు. ప్రీతిని వేధింపులకు గురిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తమ గ్రామంలో డాక్టర్ అయిన మొదటి అమ్మాయి తన కూతురు ప్రీతినేనని చెప్పారు. కానీ చివరకు ఇలా జరుగుతుందని అనుకోలేదని కన్నీటిపర్యంతం అయ్యారు. కేఎంసీలో హెచ్‌వోడీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది.
ప్రీతి ఆత్మహత్య చేసుకునేంతా పిరికిది కాదని ఆమె సోదరి చెప్పారు. సీనియర్లు వేధిస్తున్నారని తమతో చెప్పి బాధపడేదని తెలిపారు. ప్రీతికి తమ కుటుంబం పెద్ద సపోర్ట్‌గా ఉందని.. ఆమె ఇలాంటి పిచ్చి పని చేయదని అన్నారు. ప్రీతిని ఎవరో ఏదో చేసి ఉంటారని ఆరోపించారు.
ఇక,ప్రీతి మృతదేహానికి పోస్టుమార్టమ్ అనంతరం ఆమె స్వస్థలం జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్ని తండాకు తరలించారు. ప్రీతి మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గిర్ని తండాలో పూర్తిగా విషాదఛాయలు నెలకొన్నాయి. మరికాసేపట్లో ప్రీతి అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ప్రస్తుతం ప్రీతి స్వస్థలంలో భారీగా పోలీసులను మోహరించారు.
మరోవైపు ఈ ఘటనపై తెలంగాణ సర్కార్ స్పందించింది. ప్రీతి కుటుంబానికి రూ.30లక్షల ఎక్స్ గ్రేషియాతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. అంతేకాకుండా ప్రీతి మృతిపై విచారణ జరిపించేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇక, ప్రీతి మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు, పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.
ఇదిలా ఉంటే.. జనగామ జిల్లాకు చెందిన ప్రీతి.. వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్థీషియా మొదటి సంవత్సరం చదువుతోంది. మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న సమయంలో ఈ నెల 22న ఉదయం 6.30 గంటల ప్రాంతంలో విషపూరిత ఇంజక్షన్ వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ప్రీతిని అపస్మారక స్థితిలో ఉండటం గమనించిన ఆసుపత్రి సిబ్బంది సీనియర్ వైద్యులక సమాచారం అందించారు. వారు ఆమెను అత్యవసర వార్డుకు తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రీతి ఆదివారం రాత్రి 9.10 గంటలకు మరణించిందని వైద్యులు తెలిపారు.
ఇక, సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య యత్నంచినట్టుగా పోలీసులు గుర్తించారు. సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ర్యాగింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు చెప్పారు. ఈ క్రమంలోనే సైఫ్‌ను అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు ప్రకటించారు. శుక్రవారం సైఫ్‌ను హన్మకొండలోని కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం సైఫ్‌ను ఖమ్మం జైలుకు తరలించారు.