మోడీ కేబినెట్ లో కిషన్ రెడ్డి.. రేసులో అర్వింద్ కూడా ?

By Siva KodatiFirst Published May 25, 2019, 11:08 AM IST
Highlights

అసెంబ్లీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన విపక్షాలు బిజెపి, కాంగ్రెస్.. టిఆర్ఎస్ కు లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చాయి. కాంగ్రెస్ పార్టీ 3 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించగా అనూహ్యంగా బిజెపి 4 స్థానాల్లో విజయం సాధించింది. 

ఉత్కంఠ భరితంగా పోటీ ఉంటుందనుకున్న ఏపీ ఎన్నికలు ఏక పక్షంగా సాగాయి. టిఆర్ఎస్ కు తిరుగులేదనుకున్న తెలంగాణ లోక్ సభ ఎన్నికలు ఉత్కంఠ భరింతంగా సాగాయి. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. దీనితో కొద్దినెలల వ్యవధిలోనే జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కూడా పెద్దగా తేడా ఉండదని అనుకున్నారు. మొదటి నుంచి టిఆర్ఎస్ పార్టీ 16 లోక్ సభ స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయం అనే అంచనాలు వినిపించాయి. 

అసెంబ్లీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన విపక్షాలు బిజెపి, కాంగ్రెస్.. టిఆర్ఎస్ కు లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చాయి. కాంగ్రెస్ పార్టీ 3 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించగా అనూహ్యంగా బిజెపి 4 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఎంఐఎం ఒక ఒక స్థానాన్ని దక్కించుకుంది. అధికార టిఆర్ఎస్ మాత్రం 9 సీట్లతో సరిపెట్టుకుంది. బిజెపి అభ్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో కేసీఆర్ కుమార్తె కవిత ఓటమిపాలు కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

కొత్తగా కొలువుదీరబోయే కేంద్ర కేబినెట్ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. మోడీ కేబినెట్ లో మంత్రులుగా ఈ సారి కొత్తవారికి ఎక్కువగా అవకాశం కల్పించబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి మంత్రి పదవి రేసులో కిషన్ రెడ్డి ముందున్నారు. అత్యంత కీలకమైన సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కిషన్ రెడ్డి విజయం సాధించారు. 

ఏకంగా కవితనే ఓడించడంతో ధర్మపురి అర్వింద్ కూడా మంత్రి పదవి రేసులోకి వచ్చారు. కానీ సీనియర్ గా కిషన్ రెడ్డికే ఎక్కువ అవకాశాలు ఉండొచ్చని అంటున్నారు. కిషన్ రెడ్డికి బిజెపి అధిష్ఠానంతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక రాంమాధవ్ కు కూడా మోడీ అవకాశం కల్పించొచ్చని అంటున్నారు. సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ లాంటి సీనియర్లకు విశ్రాంతి కల్పించి మోడీ కొత్తవారిని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. 

click me!