
తెలంగాణలో ఈ ఏడాది చివర్లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న బలమైన నేతలను హస్తం గూటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులతో పలువురు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు.
అయితే గ్రేటర్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా బలమైన నేతలను కాంగ్రెస్‌లోకి తీసుకురావడంపై కూడా పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే గతంలో పార్టీకి దూరమైన సీనియర్లను తిరిగి పార్టీలోకి రప్పించేందుకు మంతనాలు జరుపుతుంది. ఈ క్రమంలోనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై మంచి పట్టున్న కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్)తో చర్చలు జరిపిన పార్టీ ముఖ్య నేతలు.. ఆయనను తిరిగి పార్టీ దారికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆయన ఇటీవల గాంధీ భవన్‌లొ జరిగిన కార్యక్రమంలో కనిపించారు.
కేఎల్‌ఆర్ రాకతో మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ లబ్ది చేకూరుతుందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. కేఎల్‌ఆర్ కూడా మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో బీఆర్ఎస్ నుంచి బలమైన నేతలుగా ఉన్నవారిని ఢీకొట్టేందుకు సిద్దమవుతున్నారు. ప్రస్తుతం కేఎల్‌ఆర్ మూడు నియోజకవర్గాలపై దృష్టి సారించినట్టుగా చెబుతున్నారు.
మహేశ్వరంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డి.. తర్వాత బీఆర్ఎస్‌లో చేరి ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై ఉన్న వ్యతిరేకత అంశాలపై దృష్టి సారించిన కేఎల్‌ఆర్.. అక్కడ క్షేత్రస్థాయి పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మంత్రి మల్లారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మేడ్చల్ నియోజకవర్గంపై కూడా కేఎల్‌ఆర్ దృష్టిసారించారు. అంతేకాకుండా తాండూర్ కూడా ఆయన జాబితాలో ఉంది. ఈ మూడు స్థానాల్లో ఎక్కడో ఒక చోట నుంచి పోటీ చేసేందుకు కేఎల్‌ఆర్ సిద్దంగా ఉన్నారని.. పార్టీ అవసరాలను బట్టి కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. అయితే కేఎల్‌ఆర్‌ను మూడు నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచి బరిలో నిలిపిన తమక ఒక సీటు గ్యారెంటీ అన్న ధీమాతో పీసీసీ ఉన్నట్టుగా తెలుస్తోంది.