టీఆర్ఎస్ లోకి చేరిన ఖ‌మ్మం కాంగ్రెస్ నాయ‌కులు

By team teluguFirst Published Jan 7, 2022, 4:50 PM IST
Highlights

ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు శుక్రవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వ‌ర్యంలో నాయకులు పార్టీలో చేరగా.. వారిని మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. 

ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వారిని టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తాము పార్టీలో చేరుతున్నట్టు నాయ‌కులు చెప్పారు. టీఆర్ఎస్‌లోకి చేరిన వారిలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేష‌న్ ప‌రిధిలోని కాంగ్రెస్ కార్పొరేటర్ లు మోతారపు శ్రావణి, ధానాల రాధ, రఘునాధపాలెం మండలం బుడిదంపాడు సర్పంచ్ మీరాల‌తో పాటు పలువురు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు టీఆర్ఎస్‌లోకి చేరారు. ఈ కార్య‌క్ర‌మం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో జ‌రిగింది. 

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు... సీఎం కేసీఆర్‌ నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలను, మంచి కార్య‌క్రమాల‌ను ప్రారంభించార‌ని చెప్పారు. తెలంగాణ‌లోని పట్టణాలతో పాటు గ్రామాల‌ను అభివృద్ధి చేశార‌ని తెలిపారు. అలాగే తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి ఎంతో అభివృద్ధి చేశారని కొనియాడారు. గ‌తంలో కాంగ్రెస్‌ పాలనలో రైతుల ఆత్మహత్య‌లు అధికంగా జ‌రిగేవ‌ని అన్నారు.  గ్రామాల్లో కనీస వసతులు లేక ఎన్నో ఇబ్బందులు ప‌డ్డారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక‌, టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక రైతుల‌కు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేప‌ట్టామ‌ని అన్నారు. రైతుల‌కు ఉచితంగా 24 గంటల పాటు క‌రెంటు అందిస్తున్నామ‌ని తెలిపారు. రాష్ట్రంలోని అనేక గ్రామాలకు, తండాలకు బీటీ, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, శ్మశాన వాటికలు మంజూరు చేశామ‌ని తెలిపారు. ప‌ల్లెల్లో ఆహ్లాదం కోసం ప్ర‌కృతి వ‌నాలు నిర్మించామ‌ని, ఇంకా ఇత‌ర అభివృద్ధి ప‌నులు చేప‌ట్టామ‌ని అన్నారు. 
 

click me!