కెజి టు పిజి ..పెద్ద క్యాబేజి

Published : Nov 20, 2016, 04:43 AM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
కెజి టు పిజి ..పెద్ద క్యాబేజి

సారాంశం

ఉన్న స్కూళ్లలోనే సదుపాయాలులేవు వర్సిటీలలో ప్రొఫిసర్లు లేరు రెండున్నరేళ్లైన డిఎస్సి ఊసే లేదు హామిగానే మిగిలిన అద్భుత పథకం

 

మాటలు కోటలు దాటుతాయి... అడుగు గడప దాటదు అంటే ఇదేనేమో... హామీలను అటకెక్కించి జనం చెవ్విలో క్యాబేజిలు పెట్టడం అధికార పక్షానికి ఇప్పుడు అలవాటుగా మారింది.

ఎన్నికల సమయంలో కుల మత బేధాలు లేకుండా కెజి నుంచి పిజి వరకు విద్యార్థులందరూ ఒకే చోట చదివేలా అద్భుత పథకాన్ని అమలు చేస్తామని గులాబీ పార్టీ ఊదరగొట్టింది.

తన  మేనిఫెస్టోలో కూడా కెజి టు పిజి  పథకానికి ఎక్కువగానే ప్రచారం కల్పించి ఓట్లను కొల్లగొట్టింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా పథకం అమలుపై మీనమేషాలు లెక్కిస్తుంది.

 

కేసీఆర్ మానసపుత్రికగా పేర్కొనే ఈ పథకంపై అసలు ప్రభుత్వం సీరియస్ గా ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఇంత భారీ పథకానికి ఈసారి బడ్జెట్ లో ప్రభుత్వం కేటాయించింది కేవలం రూ. 200 కోట్లు మాత్రమే. ఈ నిధులతో కనీసం ఒక్క వసతి గృహాన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్మించడం కుదరదు.

 

అలాంటిది ప్రతి నియోజకవర్గంలో కెజి టు పిజి వసతి గృహాలు నిర్మిస్తామని, అలాగే మైనారిటీలకు, ఎస్సీ లకు ప్రత్యేకంగా మరిన్ని వసతి గృహాలు ఏర్పాటు చేస్తామని చెబుతోంది.

 

అసలు ఇదంతా పక్కన పెడితే రాష్ట్రంలో పాఠశాలల పనితీరే పడకేసింది. సగం పాఠశాలలో మౌలిక వసతులే లేవు. విద్యార్థులు లేరనే సాకుతో కొన్ని పాఠశాలలను ప్రభుత్వమే ఎత్తేసింది. గత కొన్నేళ్లుగా టీచర్ల నియామకం పూర్తిగా నిలిపివేయడంతో ఉపాధ్యాయుల కొరత వేధిస్తుంది.

 

దీనిపై ఇటీవల సుప్రీం కోర్టు కూడా ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మహబూబ్ నగర్ జిల్లాలలో కొన్ని పాఠశాలల విద్యార్థులు మాకు పాఠాలు చెప్పేందుకు టీచర్లే లేరంటూ డైరెక్టుగా సుప్రీం కోర్టులోనే మొర పెట్టుకున్నారు. ఈ విషయంపై సుప్రీం సీరియస్ అయి ఉపాధ్యాయుల భర్తీ వెంటనే చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. అయినా ఈ విషయాన్ని కేసీఆర్ సర్కార్ లైట్ గానే తీసుకుంది.

 

ఒక వైపు ఆంధ్రప్రదేశ్ లో టిడిపి అధికారంలోకి రాగానే డిఎస్సి ప్రకటన విడుదల చేసి టీచర్ల నియామకాన్ని కూడా పూర్తి చేసింది.

 

ఇక తెలంగాణ లో మాత్రం డిఎస్సీ ప్రకటన బేతాళుడి కథలా మారింది.  రాష్ట్రం ఏర్పడి రెండున్నరేళ్లు దాటుతున్న ఇప్పటి వరకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టనే లేదు. ఈ రోజే ప్రకటన అంటారు రేపు క్రమబద్దీకరణ చేయాలి, జోనల్ వ్యవస్థ సమస్యగా ఉంది అంటూ దాటేస్తారు. ఇలా నిరుద్యోగులతో ఆడుకోవడం అధికార పక్షానికి అలవాటుగా మారింది.

 

పాఠశాలల పరిస్థితి ఇలా ఉంటే వర్సిటీల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రాష్ట్రం లో 8 రాష్ట్ర స్థాయి వర్సిటీలు ఉంటే ఒక్క దానిలో కూడా పర్మినెంట్ ఉద్యోగులు సంఖ్య 20 కి మించదు.

వర్సిటీలలో మెస్ బిల్లులు కట్టడానికే చెతులెత్తేసిన ప్రభుత్వం ఇంకా కెజి టు పిజి వరకు ఉచిత విద్యను ఎలా అందిస్తుందని విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి.

 

టీఆర్ఎస్ పార్టీ తన మెనిఫెస్టోలో పేర్కొన్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను శరవేగంగా పూర్తి చేస్తున్నా... పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించే ఈ పథకాన్ని ఇంకా మొదలు పెట్టకపోవడం ప్రజలను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తుంది.

 

తమ బిడ్డలకు కార్పొరేట్ స్థాయిలో ఇంగ్లిష్ మీడియం చదవులుచెప్పించ వచ్చని టీఆర్ ఎస్ కు ఓటేసిన ప్రజల ఆశలపై  కేసీఆర్ సర్కార్ నీళ్లు చల్లింది.

 

 

 

PREV
click me!

Recommended Stories

Top 5 Biggest Airports in India : అతిపెద్ద విమానాశ్రయం మన హైదరాబాద్ దే.. ఎన్ని వేల ఎకరాల్లో ఉందో తెలుసా?
CM Revanth Reddy Speech: కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు | Asianet News Telugu