కేసీఆర్ కేబినెట్లోకి కేరళ ఐజీ లక్ష్మణ్: ఐటి శాఖ అప్పగింత

By telugu teamFirst Published Feb 5, 2020, 5:01 PM IST
Highlights

కేరళ ఐజి లక్ష్మణ్ తన పదవికి రాజీనామా చేసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాబినెట్లో చేరబోతున్నారు. ఇందుకు సంబంధించిన వార్తాకథనాన్ని ఓ మలయాళీ పత్రిక ప్రచురించింది.

హైదరాబాద్: కేరళ ఐజీ జి. లక్ష్మణ్ తన పదవికి రాజీనామా చేసి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు క్యాబినెట్ లో చేరుతారనే ప్రచారం సాగుతోంది. లక్ష్మణ్ కేరళ క్యాడర్ కు చెందిన 1997 ఐపిఎస్ అధికారి. త్వరలోనే ఆయన కేసీఆర్ మంత్రివర్గంలో చేరుతారని అంటున్నారు. 

ప్రస్తుతం లక్ష్మణ్ కేరళ ట్రాఫిక్, సోషల్ పోలిసింగ్ విభాగం ఇన్ స్పెక్టర్ జనరల్ గా ఉన్నారు. ఆయన త్వరలోనే తన పదవికి రాజీనామా చేస్తారని అంటున్నారు. ఈ విషయాన్ని కేసీఆర్ ఇప్పటికే కేరళ ముఖ్యమంత్రి పనరయి విజయన్ కు చెప్పినట్లు సమాచారం. 

లక్ష్మణ్ ప్రస్తుతం హైదరాబాదులో ఉన్నట్లు సమాచారం. రెండు రోజుల్లో ఆయన కేరళకు తిరిగి వెళ్తారని తెలుస్తోంది. తాను కేసీఆర్ మంత్రివర్గంలో చేరుతున్నట్లు 46 ఏళ్ల ఐపిఎస్ అధికారి ఓ మలయాళీ పత్రికకు చెప్పారు. 

తనకు ఐటి శాఖ ఇస్తారనే సమాచారం ఉందని, ఈ విషయాన్ని తాను ఇదివరకే కేరళ పోలీసు చీఫ్ లోకనాథ్ బెహెరాకు చెప్పానని ఆయన అన్నారు. లక్ష్మణ్ కు మరో 14 ఏళ్ల ఏళ్ల సర్వీస్ ఉన్నప్పటికీ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. 

రాజకీయాల్లో లక్ష్మణ్ కు పలువురు బంధువులున్నారు. 2009, 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయనకు ఆఫర్స్ వచ్చాయి. కానీ ఇందుకు ఆయన అంగీకరించలేదు. 

లక్ష్మణ్ తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందినవారు. ఆయన తన పోలీసు కెరీర్ ను అలప్పుజా ఎఎస్పీగా ప్రారంభించారు. తిరువనంతపురం క్రైమ్ బ్రాంచ్ లో కూడా పనిచేశఆరు. కేరళ పోలీసు నిఘా విభాగంలో కూడా ఆయన పనిచేశారు. బీఎస్ఈ ఎస్ఎంఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా సైతం పనిచేశారు. 

లక్ష్మణ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డీజీపి డీటీ నాయక్ కూతురు డాక్టర్ కవితను పెళ్లి చేసుకున్నారు. 

click me!