
రాష్ట్రంలోని ఏ రోడ్డు మీద ఒక్క గుంత కూడా కనిపించడానికి వీల్లేదని తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ హుకుం జారీ చేశారు.
అంతేకాదు, మే నెలాఖరులోగా అన్ని గుంతలు పూడ్చేసి, రోడ్ల న్నింటిని నున్నగా మార్చాలని కూడా ఆయన ఆదేశించారు.
‘జూన్ 1 తర్వాత నేను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తా. ఎక్కడయినా ఒక్క గుంత కనిపించినా సరే సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటా,‘ అని ఆయన రహదారుల భవనాల శాఖసమీక్షలో చాలా స్పష్టంగా ఆదేశించారు.
కొత్త రహదారుల నిర్మాణానికి, పాత రోడ్ల మరమ్మత్తులకు చాలా నిధులు బడ్జెట్లో కేటాయించామని , అయినా ఇంకా గుంతల రోడ్లు కనిపించడం చాలా బాధాకరమని ముఖ్యమంత్రి ఆవేదన చెందారు.
ఇంక, ఈ నిర్లక్ష్యాన్ని ఎంత మాత్రం క్షమించేది లేదని హెచ్చరించారు.
‘‘చరిత్రలో రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి ఇంతపెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేశారా. కేంద్రాన్ని ఒప్పించి అనేక జాతీయ రహదారులనుకూడా తెచ్చుకున్నాం. కొత్త రోడ్ల నిర్మాణంతో పాటు పాత రోడ్ల మరమ్మత్తులకు కూడా నిధులిచ్చాం. అయినా ఇంకా రోడ్ల మీద ఇంకా గుంతలేంది. అవే ప్రమాదానికి కారణం. నేను మొన్న వరంగల్ నుంచి పాలకుర్తి వరకు కార్లో ప్రయాణం చేసినా. ఎక్కడ చూసినా గుంతలే. గుంతలు ఉండవద్దు. ఎప్పటికప్పుడు వాటిని పూడ్చేయాలని గతంలోనే చెప్పా. అధికారులు సీరియస్ గా తీసుకోలేదు. ఇది మంచి పద్దతి కాదు. మీకు సరిగ్గా నెలరోజుల టైమ్ ఇస్తున్నా. మే నెల చివరి నాటికి గుంతలు పూడ్చాలే. గుంతలు కనిపిస్తే అక్కడిక్కడే అధికారిని సస్పెన్షన్ ఖాయం’’ అని కెసిఆర్ హెచ్చరించారు.