టీ సచివాలయ శంకుస్థాపనకు జగన్: జలవివాదాలపై 28న సిఎంల భేటీ

By telugu teamFirst Published Jun 22, 2019, 12:00 PM IST
Highlights

నదీ జలాల వివాదాలను కూడా పరిష్కరించుకునే దిశగా జగన్, కేసీఆర్ అడుగు ముందుకు వేస్తున్నారు. ఇందుకుగాను ఇరువురు ముఖ్యమంత్రులు ఈ నెల 28వ తేదీన అమరావతిలో సమావేశమయ్యే అవకాశాలున్నాయి.

హైదరాబాద్: తెలంగాణ కొత్త సచివాలయ భవనాల శంకుస్థాపన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యే అవకాశాలున్నాయి. తెలంగాణ సచివాలయ భవనాల శంకుస్థాపన ఈ నెల 27వ తేదీన జరగనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే, నదీ జలాల వివాదాలను కూడా పరిష్కరించుకునే దిశగా జగన్, కేసీఆర్ అడుగు ముందుకు వేస్తున్నారు. ఇందుకుగాను ఇరువురు ముఖ్యమంత్రులు ఈ నెల 28వ తేదీన అమరావతిలో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. ఈ సమావేశానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అధికారులు కూడా వస్తారని సమాచారం. 

ముఖ్యమంత్రుల సమావేశం విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ధ్రువీకరించలేదు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పై, కృష్ణా గోదావరి నదీ జలాల వివాదాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించే అవకాశం ఉంది. దానికి ముందు హైదరాబాదులో ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశమవుతారని సమాచారం. 

నదీజలాల పంపకాలకు సంబంధించి కోర్టుల్లో పలు కేసులు ఉన్నాయి. గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, కేసీఆర్ కు మధ్య గవర్నర్ సత్సంబంధాలను నెలకొలిపి చర్చలు జరిగే దిశగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితాలు కనిపించలేదు. అయితే, ప్రస్తుతం ఇరువురు ముఖ్యమంత్రులు ఇచ్చిపుచ్చుకునే దిశలో సాగుతున్నందున సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవచ్చునని భావిస్తున్నారు. 

నదీజలాల వివాదాలను పరిష్కరించుకోవడానికి కేంద్రం జోక్యం గానీ గవర్నర్ జోక్యం గానీ అవసరం లేదని కేసీఆర్ భావిస్తున్నారు. ఇరువురు ముఖ్యమంత్రులు సయోధ్యతో ముందుకు సాగినప్పుడు ఆ అవసరం ఏర్పడదని ఆయన అంటున్నారు. కోర్టుల్లో కేసులు పెండింగులో ఉన్నందున ఇరు రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోయింది. దీంతో వాటిని పూర్తి చేసే దిశగా వివాదాలను పరిష్కరించుకోవాలని కెసిఆర్, జగన్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇరువురి మధ్య భేటీ జరుగుతుందని అంటున్నారు.

click me!