
హైదరాబాద్: తెలంగాణలో పాగా వేయడానికి బిజెపి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తన సొంత బలాన్ని పెంచుకోవడానికి ఓ వైపు ప్రయత్నిస్తూనే, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవడానికి మరో వైపు ప్రయత్నిస్తోంది. ఓ ఎంపినీ, పది మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకునేందుకు బిజెపి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలు తీవ్రమైన సంచలనం రేపుతున్నాయి. బిజెపి తలుచుకుంటే అటువంటి ప్రయత్నాలు ఫలితం ఇవ్వడమనేది చాలా సులభంగా జరుతుందని కొన్ని ఇతర రాష్ట్రాల పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను బిజెపి చేరికల కమిటీ కన్వీనర్ గా నియమించిన ఆపరేషన్ ఆకర్ష్ వేగం పుంజుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఓడించకపోతే తన జీవితం సార్థకం కాదని ఈటల రాజేందర్ అంటున్నారు. తనపై హుజూరాబాద్ లో పోటీ చేయాలని ఆయన కెసిఆర్ కు సవాల్ కూడా విసురుతున్నారు. లేదంటే గజ్వెల్ లో కెసిఆర్ మీద పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన అంటున్నారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్ నుంచి విజయం సాధించి, చురుగ్గా వ్యవహరిస్తుండడం బిజెపికి కలిసి వచ్చే విషయంగానే కనిపిస్తోంది. విశేషమైన సంబంధాల కారణంగా బిజెపిలోకి నాయకులను రప్పించడంలో ఆయన చాలా వరకు ఫలితం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి.
కాంగ్రెస్, టిఆర్ఎస్ ల్లోని బలమైన నాయకులకు గాలం వేస్తోంది. ప్రస్తుత ప్రజాప్రతినిధులను, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులను గుర్తించి వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. టిఆర్ఎస్ లోని పలువురు నాయకులు తీవ్రమైన అసంత్రుప్తితో ఉన్నట్లు బిజెపి నాయకత్వం భావిస్తోంది. దీంతో టిఆర్ఎస్ నాయకులతో మాట్లాడుతూ దాని తీవ్రతను గుర్తించి వారికి గాలం వేస్తోంది.
అదే సమయంలో కాంగ్రెస్ లోని బలమైన నాయకులకు కూడా బిజెపి గాల వేస్తోంది. తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించిన తర్వాత పార్టీలో తలెత్తిన విభేదాలను తన ఆయుధంగా మలుచుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తన వేపు తిప్పుకుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరడానికి ముహూర్తం కూడా ఖరారైనట్లు చెబుతున్నారు. మరో వైపు టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ఎంపితో పాటుముది మంది ఎమ్మెల్యేలతో బిజెపి నాయకులు చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణలో నేతల చేరికలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో బలంగా ఉన్న నాయకులపై బిజెపి ద్రుష్టి పెట్టింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మాజీ ఎంపీ బిజెపిలో చేరడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. అదే జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి కూడా బిజెపిలో చేరడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు వార్తలువస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఓ మాజీ మంత్రి బిజెపి వైపు చూస్తున్నట్లు సమాచారం.
టిఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ ఐఎఎస్ అధికారి తేజవత్ రామచంద్రు బిజెపిలో చేరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బిజెపిలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల బిజెపిలో చేరే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలువురు నాయకులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం బిజెపి తెలంగాణలో పాగా వేసే దిశగా పావులు కదుపుతోంది.