చంద్రబాబుపై కేసీఆర్ తిరుగుబాటే గుర్తుస్తోంది: విజయశాంతి

By telugu teamFirst Published Sep 11, 2019, 7:59 AM IST
Highlights

కేసీఆర్ కనుసైగ చేస్తే బెదిరే రోజులు ఇప్పుడు టీఆర్ఎస్ లో లేవని తెలంగాణ కాంగ్రెసు నేత విజయశాంతి అన్నారు. 19 ఏళ్ల క్రితం చంద్రబాబుపై కేసీఆర్ తిరుగుబాటు చేసిన రోజులు గుర్తుకు వస్తున్నాయని, టీఆర్ఎస్ లో అదే పరిస్థితి ఉందని ఆమె అన్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో నెలకొన్న తాజా పరిణామాలపై తెలంగాణ కాంగ్రెసు నేత, సినీనటి విజయశాంతి తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలను చూస్తుంటే సరిగ్గా 19 ఏళ్ల క్రితం చంద్రబాబు ఎదుర్కున్న పరిస్థితి గుర్తుకు వస్తోందని అన్నారు. చంద్రబాబు తన మంత్రివర్గాన్ని విస్తరించిన తర్వాత తలెత్తిన అసమ్మతి గుర్తుకు వస్తోందని ఆమె అన్నారు. 

అప్పటి వరకు తనకు తిరుగులేదని అనుకున్న చంద్రబాబుకు అప్పట్లో జరిగిన మంత్రివర్గ విస్తరణ తర్వాత గడ్డు రోజులు ప్రారంభమయ్యాయని ఆమె అన్నారు. తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో కేసీఆర్ తిరుగుబాటు చేయడదం, చివరకు అది టీజీపి ఉనికిని ప్రశ్నార్థకం చేయడం ఎవరూ మరిచిపోలేరని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను చూస్తున్నవారందరికీ కూడా గతంలో చంద్రబాబుకు ఎదురైన అనుభవమే ఇప్పుడు కేసీఆర్ కు కూడా ఎదురవుతుందన్న అభిప్రాయం కలుగుతోందని అన్నారు. 

మొదటి నుంచి టీఆర్ఎస్ ను అంటి పెట్టుకున్న తమను విస్మరించారనే అసమ్మతి ఓ వైపు, పదవుల కోసం పార్టీ మారినా కూడా తమను పట్టించుకోలేదనే అసహనం ఓవైపు నెలకొందని. దానివల్ల కేసీఆర్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారిందని విజయశాంతి అన్నారు. తన మాటే శాసనం అనుకున్న కేసీఆర్ కు వ్యతిరేకంగా ధిక్కార స్వరాలను వినిపించేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదని అన్నారు. 

అసమ్మతి నేతలను బెదిరించి వారితో తనకు మద్దతుగా ప్రకటనలు చేయించుకుంటూ కేసీఆర్ సంక్షోభ నివారణకు ప్రయత్నాలు చేయవచ్చు గానీ రోజురోజుకూ పెరిగే అసంతృప్తిని కట్టడి చేయడం ఆయన తరం కాదని విజయశాంతి అన్నారు. టీఆర్ఎస్ లోని నిరసన గళాలనలు చూస్తుంటే గతంలో మాదిరిగా కేసీఆర్ పేరు చెప్తే భయపడే రోజులు పోయాయనే విషయం స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. 

తను కనుసైగ చేస్తే వణికిపోయే పరిస్థితి నుంచి తనకు వ్యతిరేకంగా మాట్లాడే స్థాయికి టీఆర్ఎస్ లో అసమ్మతి వర్గం పెరుగుతోందంటే దాని వెనక ఉన్న అదృశ్య శక్తి ఏమిటో కేసీఆర్ కు ఇప్పటికే అర్థమై ఉంటుందని ఆమె అన్నారు. తన అభిప్రాయాలను ఆణె మీడియా అకౌంట్ లో పోస్టే చేశారు. 

కాంగ్రెసు, టీడీపిల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి, సంబరపడిన గులాబీ బాస్ కు ఇప్పుడు అదే అనుభవం బిజెపి రూపంలో ఎదురు అవుతుందన్న వాదన వినిపిస్తోందని, రోజువారీ పరిణామాలు కూడా ఈ వాదాన్ని బలపరిచే విధంగానే ఉన్నాయని ఆమె అన్నారు. 

click me!