దీదీ ర్యాలీకి కేసీఆర్ గైర్హాజర్: అందుకే అంటూ కవిత

By pratap reddyFirst Published Jan 20, 2019, 8:46 AM IST
Highlights

శానససభ సమావేశాలు తమ పార్టీకి అత్యంత ప్రధానమైనవని కవిత అన్నారు. బిజెపి, కాంగ్రెసులతో సంబంధం లేకుండా అటువంటి ర్యాలీల్లో భవిష్యత్తులో తమ పార్టీ పాల్గొంటుందని ఆమె చెప్పారు. 

హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు అధినేత మమతా బెనర్జీ శనివారం కోల్ కత్తాలో నిర్వహించిన ర్యాలీకి తమ పార్టీ అధినేత కె. చంద్రశేఖర రావు హాజరు కాకపోవడానికి గల కారణాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు. శనివారం యునైటెడ్ ఇండియా పేరుతో మమతా బెనర్జీ భారీ ర్యాలీని నిర్వహించిన విషయం తెలిసిందే.

ర్యాలీకి రావాల్సిందిగా మమతా బెనర్జీ ఫోన్ చేసి కేసీఆర్ ను ఆహ్వానించారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్నందు వల్లనే కేసీఆర్ ఆ ర్యాలీకి హాజరు కాలేదని కవిత చెప్పారు. తెలంగాణ జాగృతి నిర్వహించిన అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సు సందర్భంగా ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు. 

శానససభ సమావేశాలు తమ పార్టీకి అత్యంత ప్రధానమైనవని కవిత అన్నారు. బిజెపి, కాంగ్రెసులతో సంబంధం లేకుండా అటువంటి ర్యాలీల్లో భవిష్యత్తులో తమ పార్టీ పాల్గొంటుందని ఆమె చెప్పారు. ర్యాలీలో పాల్గొన్న నాయకులను చూస్తే వారు ఎంత సీరియస్ గా ఉన్నారో అర్థమవుతుందని అన్నారు. కాంగ్రెసు, బిజెపిలతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, అందువల్ల కేసీఆర్ జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ను ముందుకు తీసుకుని వెళ్లాలని నిర్ణయించారని ఆమె చెప్పారు. 

ఫెడరల్ ఫ్రంట్ కు ఎవరు నాయకత్వం వహిస్తారనేది ఇప్పటికీ సరైన నిర్ణయం జరగలేదని, అయితే ఎన్నికలకు ముందు పొత్తులు కచ్చితంగా ప్రధానమైన పాత్ర పోషిస్తాయని, ఎన్నికలకు ముందు పెట్టుకున్న పొత్తులు ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా కొనసాగాలని ఆమె అన్నారు.

click me!