ప్రగతి నివేదనకు రెడీ: క్యాబినెట్ భేటీతో ఉత్కంఠ పెంచిన కేసీఆర్

By pratap reddyFirst Published Sep 1, 2018, 4:41 PM IST
Highlights

రంగారెడ్డి జిల్లాలోని కొంగర కలాన్ లో ఆదివారం సాయంత్రం నిర్వహించే ప్రగతి నివేదన సభకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఈ సభను ఎందుకు నిర్వహిస్తున్నామో తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాలుగు పేజీల కరపత్రాన్ని విడుదల చేసింది.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని కొంగర కలాన్ లో ఆదివారం సాయంత్రం నిర్వహించే ప్రగతి నివేదన సభకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఈ సభను ఎందుకు నిర్వహిస్తున్నామో తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాలుగు పేజీల కరపత్రాన్ని విడుదల చేసింది. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ ఆ కరపత్రం విడుదలైంది. 

కాగా, కేసిఆర్ ముందస్తు ఎన్నికల వేడి రాజేశారు. ప్రగతి నివేదన సభతో ఆ వేడి మరింత రాజుకుంది. రేపటి ప్రగతి నివేదన సభకు ముందు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన మంత్రివర్గ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీంతో శాసనసభ రద్దకు మంత్రి వర్గంలో నిర్ణయం చేసి, సభలో ఆ విషయాన్ని కేసిఆర్ ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది.

అయితే, శాసనసభ రద్దుపై ఇప్పటి వరకు కూడా ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని, అయితే దానిపై చర్చ జరుగుతోందని మంత్రి కెటి రామారావు శుక్రవారంనాడు చెప్పారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశంతోనే కేసిఆర్ జోనల్ వ్యవస్థకు రాష్ట్ర పతి ఆమోద ముద్ర వేయించుకున్నారనే ప్రచారం కూడా సాగుతోంది.

ఉద్యోగాల భర్తీకి ఏ విధమైన ఆటంకం లేకుండా ఆయన చూసుకున్నారు. రేపటి మంత్రి వర్గ సమావేశంలో పింఛన్ల పెంపుపై, ఉద్యోగులకు మధ్యంతర భృతిపై నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ప్రజల కోసం కొత్తగా తీసుకోబోయే కార్యక్రమాలకు మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర వేయించుకుంటారని, ఆ తర్వాత వాటిని ప్రగతి నివేదన సభలో కేసిఆర్ ప్రకటిస్తారని అంటున్నారు. 

రేపు జరిగే మంత్రి వర్గ సమావేశంలో శాసనసభ రద్దకు నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితే ఉంది. ప్రగతి నివేదన సభ తర్వాత రెండు మూడు రోజులకు మరోసారి మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి శాసనసభ రద్దుకు నిర్ణయం తీసుకుంటారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. 

శాసనసభ రద్దు పుకార్ల నేపథ్యంలో జరుగుతున్న ప్రగతి నివేదన సభపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. కొంగర కలాన్ లో ఏర్పాటు చేస్తున్న ఆ సభకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభ నిర్వహణకు 2 వేల ఎకరాల స్థలాన్ని కేటాయించారు. 

జిల్లాల నుంచే ఇప్పటికే గులాబీ దళాలు కదలి వస్తున్నాయి. జిల్లాల నుంచి బయలుదేరి ట్రాక్టర్లు ఈ రాత్రికి హైదరాబాదు చేరుకునే అవకాశం ఉంది. దాదాపు 25 లక్షల మంది ఈ సభకు వస్తారని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు.  

click me!