ఆ రెంటిపై పారని పాచిక: న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ కు కేసీఆర్ ఎసరు

By telugu teamFirst Published Oct 31, 2019, 12:52 PM IST
Highlights

హైదరాబాదులోని ఆదర్శ్ నగర్ లో గల న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కానిస్టిట్యూషనల్ క్లబ్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎర్రమంజిల్, సచివాలయాలపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన ఆ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హైదరాబాదులోని ఆదర్శ్ నగర్ లో గల న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ పై కన్నేసినట్లు తెలుస్తోంది. ఎర్రమంజిల్, సచివాలయాల విషయంలో కోర్టు నుంచి చుక్కెదురు కావడంతో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ కు ఆయన ఎసరు పెడుతున్నట్లు సమాచారం. 

న్యూఢిల్లీలో ఉన్నట్లు హైదరాబాదులో కానిస్టిట్యూషనల్ క్లబ్ ఏర్పాటుకు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ను కేటాయించాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు. దాంతో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ను ఖాళీ చేసి హైదర్ గుడాలో కొత్తగా నిర్మించిన క్వార్టర్స్ లోకి మారాలని కేసీఆర్ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. 

పైగాల నుంచి స్వాధీనం చేసుకుని 11 ఎకరాల స్థలంలో ఆదర్శ్ నగర్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ను 1960లో నిర్మించారు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ను ఖాళీ చేయించే నిర్ణయాన్ని సెప్టెంబర్ లో జరిగిన శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా తీసుకున్నట్లు సమాచారం. 

హైదర్ గుడాలోని క్వార్టర్స్ లో వసతి తీసుకున్న తర్వాత న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ను కానిస్టిట్యూషనల్ క్లబ్ కు కేటాయించాలని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డికి విన్నవించాలని కేసీఆర్ తన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సూచించినట్లు సమాచారం. 

కొత్త ఏర్పాటు చేసే కానిస్టిట్యూషనల్ క్లబ్ లో మాజీ, ప్రస్తుత మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, స్పీకర్లు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, సచివాలయ కార్యదర్శి సభ్యులుగా ుంటారని బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం సందర్భంగా కేసీఆర్ చెప్పారు.

సచివాలయాన్ని ఖాళీ చేసిన నేపథ్యంలో బూర్గుల రామకృష్ణా రావు భవనంలో అన్ని శాఖలకు కార్యాలయాలు ఏర్పాటు చేయడంలో ఇబ్బందులు ఎదరువుతున్నాయి. తగిన స్థలాలు కూడా లభించడం లేదు. దీంతో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కొన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 

హైదర్ గుడాలోని పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ సరిపోనందున అప్పటి ప్రభుత్వం 1960లో ఆదర్శ్ నగర్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ను నిర్మించింది. అయితే, ఎమ్మెల్యేలు ఖాళీ చేసిన తర్వాత న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆవరణలో కొత్త అసెంబ్లీ భవనాన్ని కూడా నిర్మించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఎర్రమంజిల్ లోని భవనాల కూల్చివేతను హైకోర్టు అడ్డుకున్నందున ఇక్కడ అసెంబ్లీ ఏర్పాటుకు అవకాశాలున్నాయని కూడా అంటున్నారు. 

అయితే, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ అవరణలో కొత్త అసెంబ్లీని నిర్మించాలా, లేదంటే కానిస్టిట్యూషనల్ క్లబ్ ను ఏర్పాటు చేయాలా అనే విషయంపై నిర్ణయం ఎమ్మెల్యేలు ఖాళీ చేసిన తర్వాత తీసుకునే అవకాశం ఉంది.

click me!