పార్లమెంట్‌ ఎన్నికలపై కేసీఆర్ దృష్టి: జనవరి నుండి ప్రచారం

By narsimha lodeFirst Published Dec 21, 2018, 10:17 AM IST
Highlights

అసెంబ్లీ ఎన్నికల్లో  ఘన విజయం సాధించిన టీఆర్ఎస్... పార్లమెంట్ ఎన్నికలకు సిద్దమౌతోంది


హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో  ఘన విజయం సాధించిన టీఆర్ఎస్... పార్లమెంట్ ఎన్నికలకు సిద్దమౌతోంది. పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటి నుండే కేసీఆర్ రంగం సిద్దం చేసుకొంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఒక్క సీటు మినహా మిగిలిన అన్ని సీట్లను కైవసం చేసుకొనేందుకు ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. హైద్రాబాద్ పార్లమెంట్ సీటు నుండి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేయనున్నారు. ఎంఐఎం టీఆర్ఎస్ కు మిత్రపక్షంగా ఉన్నందున ఈ స్థానం మినహా మిగిలిన అన్ని స్థానాల్లో కూడ టీఆర్ఎస్ విజయం సాధించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.

కేంద్రంలో చక్రం తిప్పాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటు కోసం కేసీఆర్  ప్లాన్ చేస్తున్నారు.ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ఎవరు... ఎవరిని బరిలోకి దింపితే పార్టీకి ప్రయోజనంగా ఉంటుందనే విషయాలపై కేసీఆర్ ఆరా తీస్తున్నారు.

ఆయా పార్లమెంట్ సెగ్మెంట్లలో స్థానిక నెలకొన్న పరిస్థితులపై కేసీఆర్ అధ్యయనం చేస్తున్నారు. వాటి పరిష్కారం కోసం ఎన్నికలకు ముందే నిర్ణయం తీసుకోనున్నారు. మరో వైపు విపక్ష పార్టీలకు చెందిన బలమైన నేతలను టీఆర్ఎస్ లో చేర్చుకొనేలా ప్లాన్ చేస్తున్నారు.

అసెంబ్లీలో, శాసనమండలిలో కూడ విపక్షాలు లేకుండా చేయడం ద్వారా ప్రత్యర్థి పార్టీలపై   పైచేయి సాధించేందుకు కేసీఆర్ వ్యూహలను రచిస్తున్నారు.
గత టర్మ్‌లో టీడీఎల్పీని, బీఎస్పీ శాసనసభపక్షాలను టీఆర్ఎస్ లో   విలీనం చేసేలా కేసీఆర్ చేసిన ప్లాన్ సక్సెస్ అయింది.ఈ దఫా కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ దృష్టి పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను తమ పార్టీలో చేర్చుకొనే ప్లాన్ చేశారు. 

జనవరిలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటివరకు టీఆర్ఎస్ నిర్వహించిన సర్వేల్లో ఖమ్మం మినహా అన్ని పార్లమెంట్ స్థానాల్లో ఆ పార్టీకి అనుకూలమైన  వాతావరణం ఉందని తేలింది. 

ఖమ్మం స్థానంలో కూడ గెలిచి తీరాల్సిన పరిస్థితులు ఉన్నాయని కేసీఆర్ ఆ పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ లో కీలకంగా వ్యవహరించనున్నారు. ఈ ఫ్రంట్ లో కీలకంగా వ్యవహరించాలంటే తెలంగాణలో ఎక్కువ స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

నెలాఖరులో కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఎనిమిది మందికే ఛాన్స్?

click me!