కేసిఆర్ గారూ కేబినెట్ ప్రక్షాళన షురూ చెయ్యిరి

First Published Aug 31, 2017, 6:19 PM IST
Highlights
  • మంత్రివర్గ ప్రక్షాళన చేయండి
  • ఉద్యమకారులకు అవమానాలా?
  • ఉద్యమకారులపై దాడులు చేసినవాళ్లే కేబినెట్ లో ఉన్నారు

తాండూరులో టిఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేయడం తెలంగాణవాదులను కలవరపెడుతున్నది. తెలంగాణ స్వరాష్ట్రంలో కూడా ఆత్మబలిదానాలు జరగడం పట్ల తెలంగాణవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయూబ్ అత్మహత్యాయత్నం పై ప్రజా తెలంగాణ నేతలు గాదె ఇన్నయ్య, శ్రీశైల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వారు ఈ సందర్భంగా ఒక కరపత్రం విడుదల చేశారు. అందులో ఏముందంటే...


2004 నుంచి టీఆర్ఎస్ కార్యకర్తగా తెలంగాణ కోసం కొట్లాడినా గుర్తింపు దక్కడం లేదని, అసలైన ఉద్యమకారులు అన్యాయం అవుతున్నరు. నిన్న (30 August) వికారాబాద్ జిల్లా తాండూరులో మినిష్టర్ మహేందర్ రెడ్డి హాజరైన కార్యకర్తల సమావేశంలో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిండు తెరాస సీనియర్ నేత అయూబ్ ఖాన్. ఆయనకు హైదరాబాద్ లో (DRDO, Kanchanbagh Apollo) చికిత్స జరుగుతున్నది. ఆయన క్షేమంగా బయటపడాలని ప్రజాతెలంగాణ ఆశిస్తున్నది.

సీఎం గారూ - మినిష్టర్ మహేందర్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయండి. ఉద్యమ సమయంలో తెరాస కార్యకర్తలు సహా జేఏసీ నాయకులను ఉరికించి కొట్టించిన మహేందర్ రెడ్డి నేడు మీ కేబినేట్ సహచరుడు. మొన్నటికి మొన్న ఉద్యమకారులను తన్నండి అని పిలుపిచ్చిన మీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా తీవ్ర ఆవేదన మిగిల్చారు అసలైన, అసమాన ఉద్యమబిడ్డలకు. ఇంకా మీ కేబినెట్ లో... మీ రాజకీయ, వ్యాపార సంబంధాలలో తెలంగాణ వ్యతిరేకులు ఎంతమంది ఉన్నారో రాష్ట్రమంతా తెలుసు. ప్రక్షాళన మొదలు పెట్టండి - మరింతమంది తెలంగాణ బిడ్డలు, తెరాస కార్యకర్తలు ఆగ్రహావేశాలకు లోనుకాకముందే... స్వంత పార్టీ కార్యకర్తల, నాయకుల బాధ తెలుసుకోండి. ప్రజాతెలంగాణ గత మూడేళ్ళుగా 55 వేలమంది ఉద్యమకారులను రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యక్షంగా కలిసింది. వారి ఆవేదననూ, బాధలనూ, ఆర్ధిక నష్టాలనూ, పోలీసు కేసులనూ, వారి కుటుంబాల ఆవేదననూ, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితులనూ పలు మాధ్యమాల ద్వారా మీ దృష్టికి తెచ్చి ఉన్నాం.

ఇకనైనా మేల్కొనండి. నీళ్ళు-నిధులు-నియామకాలు-ఆత్మగౌరవం కోసం ఆరున్నర దశాబ్దాలుగా సాగిన పోరాటంలోని అసలైన వీరులను గుర్తించి, గౌరవించడం తెలంగాణ బాధ్యత. తెలంగాణ ప్రజలందరికీ పెద్దఅయిన మీరు నేడు పెద్దమనసు చేసుకోవలసి ఉన్నది. ఉద్యమకారులకు, త్యాగధనులకు న్యాయం చేయవలసి ఉన్నది.

ఆయూబ్ ఖాన్ సోదరుడు గౌస్, బావమరిది సత్తార్, భార్య, అయిదుగురు ఆడపిల్లలు, చిన్నవాడైన ఒక కొడుకు ఘోష చెవికి ఎక్కాలె మీకు సీఎం గారూ! 'అప్పుల బాధ పడలేక ఇట్ల చేసుకున్నడు' అన్న అమానవీయమైన మహేందర్ రెడ్డి మాటలు వింటున్నరా సీఎం గారూ? అయినా, మహేందర్ రెడ్డి మాటే నిజం అనుకుందాం. మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కోసం అప్పులు చేసిన వారు ఎందరో ఉండగా... మహేందర్ రెడ్డికి ఎందుకు అప్పులు లేవు? ఆత్మహత్యలు కాదుకదా వారి ఇంట్లోని ఎవరికీ కనీసం తెలంగాణ జ్వరం కూడా రావడం లేదెందుకు? ఎందుకంటే ఆయనను మీరు బాగా చూసుకుంటున్నరు కాబట్టి. ఆయననే కాదు... తుమ్మలనూ, తలసానినీ, తీగలనూ, ఇంకా ఎంతో మందిని కళ్ళలో పెట్టుకుని కాపాడుకుంటున్నారు కదా?

తెలంగాణ వ్యతిరేకులనే అంత బాగా చూసుకునే మీరు, తెలంగాణ ఉద్యమ బిడ్డలను, వారి కుటుంబాలను గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి కదా?

దయచేసి ఆలోచించండి. జై తెలంగాణ!

 

మరిన్ని తాజా తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

click me!