మారిన కేసీఆర్ వ్యూహం: తెలంగాణ కాంగ్రెసుకు ఊరట

By telugu teamFirst Published May 10, 2019, 3:04 PM IST
Highlights

కేసీఆర్ వ్యూహం కారణంగా శాసనసభలో టీఆర్ఎస్ ఎల్పీలో కాంగ్రెసు శాసనసభా పక్షం (సిఎల్పీ) విలీనం నిలిచిపోతుందనే ప్రచారం సాగుతోంది. నిజానికి, టీఆర్ఎస్ ఎల్పీలో సిఎల్పీ విలీనం ఇప్పటికే జరిగి ఉండాల్సింది. కానీ అకస్మాత్తుగా ఆగిపోయిందని అంటున్నారు. 

హైదరాబాద్: జాతీయ రాజకీయాల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వ్యూహం మారడంతో తెలంగాణ కాంగ్రెసు పార్టీకి ఊరట లభించినట్లే. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెసుతో దోస్తీ కట్టేందుకు కేసీఆర్ ప్రయత్నాలు సాగిస్తున్న విషయం తెలిసిందే.

కేసీఆర్ వ్యూహం కారణంగా శాసనసభలో టీఆర్ఎస్ ఎల్పీలో కాంగ్రెసు శాసనసభా పక్షం (సిఎల్పీ) విలీనం నిలిచిపోతుందనే ప్రచారం సాగుతోంది. నిజానికి, టీఆర్ఎస్ ఎల్పీలో సిఎల్పీ విలీనం ఇప్పటికే జరిగి ఉండాల్సింది. కానీ అకస్మాత్తుగా ఆగిపోయిందని అంటున్నారు. 

కాంగ్రెసుకు చెందిన సంగారెడ్డి శాసనసభ్యుడు జగ్గారెడ్డి టీఆర్ఎస్ లో చేరితే సిఎల్పీ విలీనానికి మార్గం ఏర్పడడమే కాకుండా శాసనసభలో కాంగ్రెసుకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పోతుంది. కాంగ్రెసుకు ప్రధాన ప్రతిపక్ష హోదాను లేకుండా చేయడానికి తగిన వ్యూహాన్నే కేసీఆర్ అనుసరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెసు శాసనసభ్యులు వరుసగా టీఆర్ఎస్ లో చేరడం ప్రారంభించారు. 

అయితే, కేసీఆర్ జాతీయ స్థాయిలో కాంగ్రెసుతో కలుపుకుని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే వ్యూహం దిశగా పయనిస్తున్నారు. కాంగ్రెసేతర, బిజెపియేతర కూటమికి ప్రయత్నాలు సాగించిన కేసీఆర్ అది సాధ్యం కాదనే భావనకు వచ్చినట్లు చెబుతున్నారు. 

ఈ స్థితిలో ఆయన కాంగ్రెసుతో సఖ్యతకు ప్రయత్నాలు చేస్తున్నట్లు గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ స్థితిలో సిఎల్పీని తమ పార్టీలో విలీనం చేసుకుంటే జాతీయ స్థాయి రాజకీయాలకు విఘాతం ఏర్పడవచ్చునని ఆయన ఆగిపోయినట్లు చెబుతున్నారు. 

click me!