
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటు పనుల్లో బిజీగా ఉంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ కేబినెట్ కూర్పుపై తలమునకలై ఉన్నారు. కొత్తవారిని కేబినెట్‌లోకి తీసుకోవాలా లేదంటే పాత కేబినెట్‌లోని వారి మంత్రిత్వ శాఖలు మార్చాలా అన్న దానిపై గులాబీ బాస్ కసరత్తు చేస్తున్నారు.
మరోవైపు ప్రమాణ స్వీకారానికి కూడా ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తొలి నుంచి ముహూర్తాలు, జాతకాలు వంటి వాటిని బలంగా నమ్ముతూ వస్తున్న కేసీఆర్... సీఎంగా రెండోసారి ప్రమాణం చేసేందుకు బలమైన ముహూర్తం కోసం వేచి చూస్తున్నారట.
దీని కోసం ఆయన పండితులతో చర్చిస్తున్నారు. రేపు సుబ్రమణ్యషష్టీ మంచి రోజని, ఉదయం 11 గంటల లోపు మూడు ముహూర్తాలు ఉన్నాయని జ్యోతిష్యులు కేసీఆర్‌కు తెలిపారట. ఎల్లుండి సప్తమి కావడంతో ఆ రోజైనా ఫర్వాలేదని చెప్పారట. ఈ రెండింటిలో ఏదో ఒక ముహూర్తాన్ని కేసీఆర్ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది. తనతో పాటు ఐదుగురు లేదా పద్నాలుగు మందితో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.