సుహాసిని ఓటమి: ఎన్టీఆర్ కూ తప్పలేదు, ఇది నాలుగోసారి

By pratap reddyFirst Published Dec 12, 2018, 8:07 AM IST
Highlights

ఎన్టీ రామారావు స్వయంగా ఓసారి పరాజయాన్ని చవి చూశారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రెండు సీట్లలో పోటీ చేశారు. అప్పుడు అనంతపురం జిల్లా హిందూపురంలో గెలిచి మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ స్థానంలో ఓటమి పాలయ్యారు. 

హైదరాబాద్:  నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని ఓటమితో ఎన్టీఆర్ కుటుంబం నాలుగోసారి ఓడిపోయినట్లు అయింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో సుహాసిని కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.

ఈమెకు ముందు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ముగ్గురు ఓటమి పాలయ్యారు. ఎన్టీ రామారావు స్వయంగా ఓసారి పరాజయాన్ని చవి చూశారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రెండు సీట్లలో పోటీ చేశారు. అప్పుడు అనంతపురం జిల్లా హిందూపురంలో గెలిచి మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ స్థానంలో ఓటమి పాలయ్యారు. 

ఆ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ కూడా ఓడిపోయింది. ఆ తర్వాత 1996 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన కుమారుడు జయకృష్ణ శ్రీకాకుళం నుంచి ఎంపీగా పోటీ చేశారు. అప్పటికి ఎన్టీఆర్‌ చనిపోయారు. ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి అధ్యక్షురాలిగా ఉన్న ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 

1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్‌ కుమారుడు హరికృష్ణ అన్న తెలుగుదేశం పార్టీ తరఫున గుడివాడ నుంచి పోటీచేశారు. టీడీపీతో విభేదించి ఆయన అన్న తెలుగుదేశం పార్టీ పెట్టారు. కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలు కాక తప్పలేదు. తర్వాత ఆయన ఆ పార్టీని రద్దు చేసి తిరిగి టీడిపిలో చేరారు. 

click me!