మహాకూటమిపై మాస్టర్ ప్లాన్: కెసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఆలోచన

By pratap reddyFirst Published Oct 8, 2018, 7:35 AM IST
Highlights

కాంగ్రెసు, తెలుగుదేశం, సిపిఐ, తెలంగాణ జనసమితి, ఇంటి పార్టీ కలిసి మహా కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికల్లో కేసీఆర్ ను ఎదుర్కోవడానికి సిద్ధపడిన విషయం తెలిసిందే. దానికి విరుగుడుగా కేసిఆర్ వ్యూహరచన చేశారు.

హైదరాబాద్: కాంగ్రెసు నేతృత్వంలోని మహా కూటమిని ఎదుర్కోవడానికి తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు మాస్టర్ ప్లాన్ వేసినట్లు కనిపిస్తున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం, సిపిఐ, తెలంగాణ జనసమితి, ఇంటి పార్టీ కలిసి మహా కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికల్లో కేసీఆర్ ను ఎదుర్కోవడానికి సిద్ధపడిన విషయం తెలిసిందే. దానికి విరుగుడుగా కేసిఆర్ వ్యూహరచన చేశారు. 

కేసిఆర్ మాస్టర్ ప్లాన్ లో భాగంగా రాష్ట్రంలో తృతీయ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. వెనకబడిన కులాలు, షెడ్యూల్ కులాలు, గిరిజన తెగలు, మైనారిటీ కమ్యూనిటీలతో కూడిన సామాజిక, కుల సంఘాలతో మూడో ఫ్రంట్ ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది.

అయితే, ఆ ఫ్రంట్ టీఆర్ఎస్ తో కలిసి పనిచేయదు. కానీ, టీఆర్ఎస్ కు అనుకూల ఫలితాలు వచ్చే విధంగా అది వ్యవహరించే అవకాశం ఉంది.  టీఆర్ఎస్, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి అది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. 

అందులో భాగంగానే కేసిఆర్ తో పాటు ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు బీసీ నేత ఆర్. కృష్ణయ్య, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ, బహుజన వామపక్ష కూటమి నేత తమ్మినేని వీరభద్రం, ప్రజా గాయకుడు గద్దర్ లతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆర్. కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా తృతీయ ప్రత్యామ్నాయం ప్రకటించనుంది.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు బిజెపి వైపు కాకుండా మహా కూటమి వైపు మళ్లుతుందనే విషయం సర్వేలో తేలడమే కాకుండా, మహా కూటమికీ టీఆర్ఎస్ కు మధ్య ముఖాముఖి పోటీ ఉంటుందని సర్వేలో తేలడంతో మూడో ఫ్రంట్ ఏర్పాటుపై కేసిఆర్ దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. 

ముఖాముఖి పోటీ వల్ల తమ పార్టీ గెలుపు అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందనే విషయాన్ని గుర్తించిన కేసిఆర్ మూడో ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

ముూడో ఫ్రంట్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు కొంత మందికి మంత్రి పదవులు ఇవ్వడానికి, ఆ ఫ్రంట్ కు చెందిన కొంత మంది నాయకులకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వడానికి కేసీఆర్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, తృతీయ ఫ్రంట్ లో కొనసాగడానికి మందకృష్ణ మాదిక వ్యతిరేకించినట్లు సమాచారం.

click me!