దళితుల కోసమే లక్ష కోట్లు... ఆర్థిక శాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలివే: మంత్రి హరీష్ (వీడియో)

By Arun Kumar PFirst Published Aug 9, 2021, 2:41 PM IST
Highlights

దళితుల అభ్యున్నతి కోసమే వచ్చే రెండున్నరేళ్లలో లక్ష కోట్లు ఖర్చు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు. 

సిద్దిపేట: రానున్న రెండున్నరేళ్లలో తెలంగాణలోని దళితుల అభివృద్ధికి లక్ష కోట్లు ఖర్చు చేయాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన అని ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు. వచ్చే సంవత్సరం బడ్జెట్ లో కేవలం దళిత బంధు పథకానికే రూ.20 నుంచి రూ.30 వేల కోట్లు కేటాయించాలని ఇప్పటికే సీఎం ఆర్థిక శాఖను ఆదేశించినట్లు హరీష్ వెల్లడించారు. 

సిద్దిపేట జిల్లా చేర్యాలలో రూ. 50 లక్షల నిధులతో నిర్మించనున్న డా.బి.ఆర్ అంబేద్కర్ కమ్యూనీటి భవన నిర్మాణ పనులకు హరీష్ రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దళితుల  అభ్యున్న‌తి కోసమే సీఎం కేసీఆర్ కు దళిత బంధు ఆలోచన వచ్చిందన్నారు. 

వీడియో

ఇదిలావుంటే ఇప్పటికే వాసాలమర్రి గ్రామంలోని దళిత కుంటుంబాలకు దళిత బంధు డబ్బులు అందిన విషయం తెలిసిందే. తాజాగా హుజురాబాద్ నియోజకవర్గ దళితులు కూడా త్వరలోనే శుభవార్త వినేలా కనిపిస్తోంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అమలుకు రూ.500 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  

read more  వాసాలమర్రితోనే దళిత బంధు ప్రారంభం.. హుజురాబాద్‌లో లాంఛనమే: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని హుజూరాబాద్ వేదికగా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి మంత్రులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొన్న వాసాలమర్రి దళితుల కోసం ఈ పథకం కింద అర్హులైన అన్ని కుటుంబాలకు రూ.7.60 కోట్లు విడుదల చేయించిన ముఖ్యమంత్రి త్వరలోనే హుజురాబాద్ లోనూ దళిత బంధు నిధులను విడుదల చేయించనున్నారు. 

అయితే హుజూరాబాద్ శాసనసభ ఉప ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికి దళిత బంధు అమలు చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు వ్యాఖ్యలు వినిపించాయి. దీంతో తొలుత వాసాలమర్రి గ్రామానికి తొలుత దళిత బంధు నిధులను కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసింది.
 

click me!