జగన్ ప్రభుత్వంపై కేసీఆర్ గుర్రు: పోరు తప్పదని చెప్పిన సీఎం

By telugu teamFirst Published May 12, 2020, 6:40 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నీటి వాడకంపై ఆయన వైఎస్ జగన్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

హైదరాబాద్:  తెలుగు రాష్ట్రాల మధ్య అప్పుడే నీటి యుద్ధం మెుదలైనట్లు కనిపిస్తోంది. కృష్ణా-గోదావరి నదీజలాల విషయంలో కలిసి పయనించాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైయస్ జగన్మోహన్ రెడ్డి భావించారు. అందుకు వ్యూహరచన కూడా చేశారు. అయితే తాజాగా ఆ వ్యూహాలు వికటించాయో లేదో తెలియదు గానీ ఇరు రాష్ట్రాల మధ్య అభిప్రాయబేధాలు ప్రారంభమయ్యాయి. 

నదీజలాల విషయంలో సీఎం కేసీఆర్ జగన్ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.  శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ ఏపీ ప్రభుత్వం తలపెట్టిన కొత్త ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉన్న ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి న్యాయ పోరాటం చేస్తామని కేసీఆర్‌ హెచ్చరించారు. 

వెంటనే కృష్ణా వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డులో ఫిర్యాదుకు ఆదేశించినట్లు తెలిపారు. ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలం నీటి విషయంలో తెలంగాణను సంప్రదించకుండానే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టడం ఏపీ ప్రభుత్వం చేసిన తప్పిదమంటూ కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఎత్తిపోతల ప్రాజెక్టును అడ్డుకోవడానికి రాజీలేని ధోరణి అవలంభిస్తామని సీఎం కేసీఆర్ తెగేసి చెప్పారు. 

ఇకపోతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం, మిగుల జలాల పంపకం, ప్రాజెక్టుల రూపకల్పన వంటి అంశాలపై సీఎం జగన్, కేసీఆర్ లు ఇప్పటికే పలుమార్లు భేటీ అయ్యారు. అంతేకాదు ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ అధికారులు సైతం ప్రగతిభవన్ లో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

అయితే ఇంతలో ఏపీ సర్కార్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి జీవో విడుదల చేశారంటూ వస్తున్న వార్తలపై సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. మరి ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

click me!