సింగరేణి కార్మికులకు కేసీఆర్ దసరా బొనాంజా

By narsimha lodeFirst Published Sep 19, 2019, 3:43 PM IST
Highlights

తెలంగాణ  సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ఇచ్చారు. 

హైదరాబాద్: సింగరేణి కార్మికులకు తెలంగాణ సీఎం కేసీఆర్  దసరా పండుగ కానుకను ఇచ్చారు. ఒక్కో కార్మికుడికి రూ.1,00899లను  బోనస్‌ ప్రకటించారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో గురువారం నాడు ప్రకటించారు.

సింగరేణి సంస్థ తెలంగాణ అభివృద్ధిలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, కార్మికుల సంక్షేమానికి తీసుకున్న చర్యల ఫలితంగా సింగరేణి సంస్థాగతంగా బలోపేతమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

యాజమాన్యం, కార్మికులు అనే తారతమ్యం లేకుండా సింగరేణిలో పనిచేస్తున్న ప్రతీఒక్కరు ఎంతో బాధ్యతగా పనిచేయడం వల్ల సంస్థలో సానుకూల వాతావరణం ఏర్పడిందన్నారు.

సంస్థ పనితీరు గణనీయంగా మెరుగుపడి రికార్డుస్థాయి ఉత్పత్తి చేయడానికి ఈ పరిణామం దోహదపడింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థలో 50.47 మిలియన్‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయగలిగారు. గత ఐదేళ్లలో ప్రతీ ఏడాది బొగ్గు ఉత్పత్తి పెరుగుతూ వస్తుంది. 2018-19 సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి రికార్డు స్థాయిలో 64.41 మిలియన్‌ టన్నులకు చేరుకున్నది.

2013-14లో సింగరేణి సంస్థ రూ. 418 కోట్ల లాభం గడించింది. గత ఐదేళ్లలో ఇది ప్రతీ ఏటా పెరుగుతూ 2018-19 నాటికి రూ. 1765 కోట్ల లాభాన్ని సింగరేణి సంస్థ సాధించగలిగింది. 

ఉత్పత్తి, రవాణా, అమ్మకం, లాభాలు, టర్నోవర్‌లో సింగరేణి సాధిస్తున్న ప్రగతి తెలంగాణ ప్రభుత్వ పాలనకు ప్రతీకగా నిలుస్తున్నది. కోల్‌ ఇండియాతో పోల్చితే సింగరేణి ఎంతో మెరుగ్గా ఉండటం మనందరికి కూడా గర్వకారణమన్నారు.

 సమైక్య పాలనలోని చివరి సంవత్సరమైన 2013-14 సంవత్సరంలో కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 13,554 చొప్పున బోనస్‌ చెల్లించారని ఆయన గుర్తు చేశారు తెలంగాణ ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో కార్మికులకు ఇచ్చే బోనస్‌కు క్రమంగా పెంచుతూ వస్తోందన్నారు.

2017-18లో లాభాల్లో 27 శాతం వాటాగా ఒక్కొక్క కార్మికుడికి రూ.60,369 ను చెల్లించింది. ఈసారి లాభాల్లో వాటాను మరో శాతానికి అంటే 28 శాతానికి పెంచుతున్నామని సంతోషంగా ప్రకటిస్తున్నామన్నారు సీఎం కేసీఆర్.

 లాభాల్లో వాటా పెంచడం వల్ల ఒక్కో కార్మికుడికి రూ.1,00899 బోనస్‌గా అందుతుందని చెప్పారు. గతేడాది కన్నా రూ.40,530 అదనంగా ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ఇది దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అందిస్తున్న కానుక అని సీఎం ప్రకటించారు.

ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని స్ఫూర్తిగా తీసుకుని కార్మికులు, సిబ్బంది మరింత అంకితభావంతో పనిచేసి మరిన్ని లాభాలు, విజయాలు సాధించిపెట్టాలని ప్రగాడంగా ఆశిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

click me!