కేసీఆర్‌కు భారీ షాక్... భార్యతో పాటు కావేటి సమ్మయ్య రాజీనామా

By sivanagaprasad kodatiFirst Published Nov 30, 2018, 7:46 AM IST
Highlights

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కీలక నేత మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, ఆయన భార్య మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ సాయిలీల టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. 

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది అధికార టీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. టికెట్ దక్కలేదనో, పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వలేదనో ఇతర కారణాల చేత పలువురు కీలక నేతలు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల్లో చేరారు.

తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కీలక నేత మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, ఆయన భార్య మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ సాయిలీల టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. గురువారం సిర్పూర్ కాగజ్ నగర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు.

అయితే సభకు హాజరుకావాలని కనీసం పిలుపు కూడా రాకపోవడంతో సమ్మయ్య దంపతులు దానిని అవమానంగా భావించారు. దీనిపై స్పందించిన సమ్మయ్య.. నన్ను అవమానించి, అన్యాయం చేసినా కేసీఆర్ మీద ఉన్న నమ్మకంతో ఓపిక పట్టాను.. కాగజ్‌నగర్ సభలో కనీస మర్యాద ఇవ్వలేదు. సమస్యలు చెప్పుకుందామంటే కేటీఆర్ ఏ ఒక్క రోజూ ఫోన్ లిఫ్ట్ చేయలేదని సమ్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

సిర్పూర్‌లో ఎవరూ దిక్కులేని సమయంలో టీఆర్ఎస్ జెండా మోశానన్నారు. ఉద్యమకారులను అణిచివేసి... ఏనాడూ పార్టీ జెండా పట్టని.. నోటి నుంచి ‘‘జై తెలంగాణ’’ అని పలకని నేతలను కేసీఆర్ నెత్తిన పెట్టుకున్నారని సమ్మయ్య ఆరోపించారు. ఈ క్రమంలో తాను సతీమణితో పాటు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు.

2009లో సిర్పూర్ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు సమ్మయ్య... తిరిగి ఏడాది వ్యవధిలోనే జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి గెలిచారు. అయితే 2014 ఎన్నికల్లో బీఎస్పీ తరపున గెలిచిన కోనేరు కన్నప్ప చేతిలో ఓడిపోయారు.

ఎన్నికల అనంతరం కన్నప్ప టీఆర్ఎస్‌లో చేరడంతో తాజా ఎన్నికల్లో కేసీఆర్ ఆయనకే సీటు ఖరారు చేశారు. దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సమ్మయ్య పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్నారు.
 

click me!