లాక్ డౌన్ సమయంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రజలకు సాయం చేస్తూ మానవత్వాన్నిచాటుకున్నారు కరీంనగర్ పోలీసులు.
కరీంనగర్: పోలీసులు ఎంత కఠినంగా వుంటారో లాక్ డౌన్ కాలంలో నిబంధనలను ఉళ్లంఘించినవారిపై లాఠీలు ఝలిపించడమే స్పష్టంగా తెలియజేసింది. ఇదే లాక్ డౌన్ సమయంలోనే వారిలోని సేవాగుణం కూడా బయటపడింది. నిబంధనలను ఉళ్ళంఘించిన ప్రజలను దండించడమే కాదు అదే ప్రజలకు కష్టం వస్తే మేమున్నామని ముందుకువస్తామని నిరూపించారు. తాము ఏం చేసినా ప్రజాసేవలో భాగమేనని మరోసారి నిరూపించారు కరీంనగర్ పోలీసులు.
తెలంగాణలో కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు లాక్ డౌన్ ను కఠినంగా అమలుచేస్తున్న విషయం తెలిసిందే. కరీంనగర్ జిల్లాలో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా వుండటంతో అక్కడ మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు అధికారులు. అయితే ప్రభుత్వ ఆంక్షల కారణంగా నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని హాస్పిటల్ కు చేర్చి మానవత్వాన్ని చాటుకున్నారు కరీంనగర్ పోలీసులు.
undefined
మంగళవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చొప్పదండి ప్రాంతానికి చెందిన చీకటి సరిత(25) వృత్తిరీత్యా గతకొంతకాలం నుండి కరీంనగర్ లోని చైతన్యపురి కాలనీలో నివసిస్తున్నారు. ప్రస్తుతం గర్భంతో ఉన్న ఆమెకు ఇవాళ ఉదయం నొప్పులు రావడంతో హాస్పిటల్ కు వెళ్లడానికి ప్రయత్నించింది. అయితే ఎలాంటి వాహన సౌకర్యం లేకపోవడంతో ఇంటిపక్కన ఉండే మరో మహిళను తోడుగా తీసుకుని ఏదైనా వాహనం దొరుకుతుందేమోనని రోడ్డుపైకి వచ్చింది.
అయితే అదే సమయంలో పెట్రోలింగ్ లో భాగంగా అటువైపుగా వెళ్లిన ఎస్ఐ నరేష్ వారి సమస్యను తెలుసుకున్నారు. వెంటనే స్పందించి పోలీస్ వాహనంలోనే సదరు గర్భిణీని కరీంనగర్ లోని ప్రభుత్వ మాతా,శిశు కేంద్రానికి తరలించారు. మానవతా హృదయంతో స్పందించి ఆసుపత్రికి తరలించిన ఎస్ఐ నరేష్, కానిస్టేబుళ్లు టి భాస్కర్, ఆర్ తిరుపతి, హోంగార్డు అఫ్జల్ లను పోలీస్ కమీషనర్ విబి కమలాసన్ రెడ్డి అభినందించారు.