కరోనా వ్యాప్తికి కారణమన్న అనుమానంతో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఓ వర్గానికి చెందిన వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కరీంనగర్ ఎంఐఎం నాయకులు ఆరోపించారు.
కరీంనగర్: కరోనా వ్యాప్తికి తామే కారణమన్న అనుమానంతో ప్రైవేట్ హాస్పిటల్స్ దూరం పెడుతున్నాయని ముస్లీం మతపెద్దలు మంత్రి గంగుల దృష్టికి తీసుకెళ్లారు. అనారోగ్యంతో వెళ్లిన ముస్లీంలకు తమ ఆసుపత్రుల్లో వైద్యం అందించడానికి డాక్టర్లే కాదు యాజమాన్యాలు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని... తారతమ్యత ప్రదర్శిస్తారున్నారని మంత్రికి తెలియజేశారు.
కరీంనగర్ నగర ఎంఐఎం అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ నేతృత్వంలో ఆ పార్టీ కార్పొరేటర్లు, ముస్లిం మత పెద్దలు, మాజీ ప్రజా ప్రతినిధులు మంత్రి గంగులను ఆయన కార్యాలయంలో ఇవాళ(గురువారం) కలిశారు. లాక్డౌన్ తరుణంలో ముస్లింలకు వైద్యాన్ని చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో వెంటనే స్పందించిన మంత్రి తక్షణమే ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వసంత రావుతో మాట్లాడారు. వైద్యం చేయడంలో కుల,మత వివక్ష ఉండబోదని ఈరోజు నుంచే అన్ని ప్రయివేటు ఆసుపత్రుల్లో నిరాటంకంగా వైద్యం చేయించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.ఈ మేరకు అన్ని ఆసుపత్రులకు వెంటనే ఆదేశాలు జారీ చేస్తామని...ఇబ్బందులు ఎదురైతే తనను సంప్రదించాలని వసంత రావు మంత్రి సమక్షంలోనే ముస్లీం మతపెద్దలకు హామీ ఇచ్చారు.