కరోనా వైరస్ ను నియంత్రించేందుకు కరీంనగర్ కు చెందిన ఓ యువతి అద్భుత ఆవిష్కరణ చేశారు.
కరీంనగర్: కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో వ్యాప్తిని నిరోధించడానికి యావత్ ప్రపంచం పోరాడుతోంది. ఈ మహమ్మారి కారణంగా భారతదేశం మొత్తం లాక్ డౌన్ లో వుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వైరస్ నివారణకు అనేక చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో కరోనా నివారణకు తమవంతు సాయం చేయాలని భావించిన కరీంనగర్ యువతి ఓ అద్భుత ఆవిష్కరించింది.
బీఎస్సీ ఫస్టీయక్ చదువుతున్న స్నేహా అనే యువతి కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్న విషయాలను గమనించి అందుకు తగ్గట్టుగా వాచ్ తయారు చేశారు. తన తండ్రి సహకారంతో బజర్ వాచ్‌ను తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం కనిపించే విధంగా తయారు చేశారు.
రిస్ట్ వాచ్‌లా ఉండే ఈ ఎక్విప్ మెంట్‌ను పెట్టుకుని బటన్ ఆన్ చేయాలి. చాలా మంది తమ చేతులతో తరుచూ ముఖాన్ని తుడుముకోవడం, కళ్లను నలుపుకోవడం చేస్తుంటారు. అప్పటికే చేతి వేళ్లపై కరోనా వైరస్ పడి ఉంటే వెంటనే ఇలా చేసే వారు కూడా ఈ వ్యాధి బారిన పడతారు. దీనికి ప్రత్యామ్నాయంగా బజర్ వాచ్ చేతులు కడుక్కోకుండా ముఖం వద్దకు తీసుకెళ్లగానే సైరన్ ఇస్తుంది. దీంతో వారు తాము చేతులు కడుక్కొవాలని గుర్తించే అవకాశం ఉంటుంది. దీనివల్ల తెలియకుండా కరోనా వైరస్ బారిన పడకుండా నిలువరించుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు స్నేహ.
సామాజిక దూరం కూడా ఇప్పుడు అత్యంత ప్రాధాన్యంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఉన్నప్పుడు తమవద్ద ఉన్న అలర్ట్ వాచ్ అప్రమత్తం చేసే విధంగా మరో వాచ్‌ను కూడా తయారు చేసే పనిలో నిమగ్నం అయినట్లు స్నేహ వెల్లడించారు.