ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ హామీలు, పథకాల కోసం దరఖాస్తులు తీసుకుంటున్నారని, కానీ, ఆ ఫలాలు బ్యాంకు ఖాతాలోకి పడటానికి ఖాతా వివరాలు ఎందుకు తీసుకోవడం లేదని, ఈ వ్యవహారంపై సామాన్యులకూ అనుమానాలు వస్తున్నాయని మాజీ ఎంపీ వినోద్ కుమార్ నిలదీశారు.
Praja Palana: మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రజా పాలన కార్యక్రమంలో లోపాలు ఉన్నాయని ఫైర్ అయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి తీసుకుంటున్న దరఖాస్తుల్లో అకౌంట్ నెంబర్లు తీసుకోవడం లేదని, దరఖాస్తులో అకౌంట్ నెంబర్లు ఎంటర్ చేయడానికి కాలమ్ ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. బ్యాంకు ఖాతా నెంబర్ తీసుకోనప్పుడు లబ్దిదారులకు డబ్బు ఎలా బదిలీ చేస్తారని నిలదీశారు.
ప్రజా పాలన కార్యక్రమంలో అభయ హస్తంలోని హామీల కోసం ప్రజలు దరఖాస్తులు చేసుకుంటున్నారు. అభయ హస్తంలోని హామీలకు బాక్స్‌లో టిక్ పెట్టి తమకు కావాలని దరఖాస్తులో కోరుతున్నారు. గ్యాస్ కనెక్షన్ నెంబర్, మీటర్ నెంబర్ వంటి వివరాలు, మహాలక్ష్మీ హామీ కింద రూ. 2,500 పొందడానికీ వివరాలు దరఖాస్తులో కోరుతున్నారు. వీటి వివరాలు అన్నీ నమోదు చేసినా.. ఆ డబ్బులు సదరు లబ్దిదారులకు అందడానికి అకౌంట్ నెంబర్లు ఎందుకు తీసుకోవడం లేదని మాజీ ఎంపీ వినోద్ ప్రశ్నించారు.
Also Read: Fact Check: అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టించబోయే రామ్ లల్లా విగ్రహం ఇదేనా?
బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకోవడం లేనందున సగటు పౌరుడికి, లబ్దిదారుడికి ఈ వ్యవహారం పై అనుమానాలు వస్తున్నాయని వినోద్ కుమార్ అన్నారు. బ్యాంకు ఖాతాల వివరాల కోసం మరోసారి గ్రామ సభలు నిర్వహిస్తారా? అని ప్రశ్నించారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో లబ్దిదారులకు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయకుండా నగదు నేరుగా అందిస్తారా? అని నిలదీశారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.