కరక్కాయ కేసులో కీలక నిందితుడి అరెస్ట్.. అసలు కరక్కాయ మోసం ఏమిటీ..?

First Published Aug 4, 2018, 6:07 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కరక్కాయ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడ మల్లిఖార్జున్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కరక్కాయ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడ మల్లిఖార్జున్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం వీరిని మీడియా ముందు హాజరుపరుస్తామని సీపీ తెలిపారు. 

అసలు ఏంటీ కరక్కాయ మోసం:
కేపీహెచ్‌బీ కాలనీ రోడ్ నంబర్-1లోని ఎంఐజీ 165లో సాఫ్ట్ ఇంటిగ్రేట్ మల్టీ టూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను ఈ ఏడాది మార్చిలో ఏర్పాటు చేశారు. కిలో కరక్కాయలు 100 రూపాయలని.. అదే కిలో కరక్కాయ పొడి తీసుకుంటే రూ.150 అని కానీ, రూ.1000 రూపాయలు డిపాజిట్ చేస్తే కిలో కరక్కాయలు ఇస్తామని.. వాటిని పొడి చేసి ఇస్తే డిపాజిట్ సొమ్ముకు అదనంగా రూ.300 కలిపి మొత్తం రూ.1300 ఇస్తామని వార్తాపత్రికలు, యూట్యూబ్ ఛానెళ్లులో ప్రచారం చేశారు.. దీంతో జనాలు ఎగబడి లక్షలకు లక్షలు కట్టారు..

కష్టపడకుండా కరక్కాయలతో కనకవర్షం కురుస్తోందని భావించారు. మొదట్లో తక్కువ మొత్తాలకు చెప్పిన విధంగా చెల్లింపులు చేయడంతో జనం ఒకరిని చూసి మరొకరు ఎగబడ్డారు. సదరు సంస్థ కరక్కాయ పొడిని తీసుకొచ్చిన ఖాతాదారులకు ప్రతి 15 రోజులకోసారి చెల్లింపులు చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా జూలై 16 సోమవారం చాలామందికి డబ్బులు ఇవ్వాల్సి  ఉంది..

అయితే ఉదయం 4 గంటల సమయంలో మేనేజర్ మల్లిఖార్జున్ కంపెనీ సిబ్బందికి ఫోన్ చేసి.. మన కంపెనీ యజమాని కోట్ల రూపాయల ఖాతాదారుల డబ్బు తీసుకుని పారిపోయాడు. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంది.. మీరు కూడా కార్యాలయానికి రావొద్దు అంటూ చెప్పాడు..

అయితే కంపెనీ హెచ్ఆర్‌గా పనిచేస్తోన్న వ్యక్తి ఒకరు బాధితుడికి ఫోన్ చేసి కంపెనీపై అనుమానంగా ఉందని... మేనేజర్ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు చెప్పడంతో.. అతను కొందరు ఖాతాదారులతో కలిసి ఆఫీసుకు రావడంతో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కంపెనీ యజమాని దేవరాజు అని.. ఆయన్ని ఎప్పుడు చూడలేదని సిబ్బంది చెప్పారు. అలాగే ఆఫీసులోని అన్ని వస్తువులు అద్దెకు తెచ్చినవేనని పోలీసులు చెప్పారంటే వారు ఎంత పకడ్బంధీగా చీటింగ్ చేశారో చెప్పవచ్చు.  

click me!