బతుకమ్మకు కల్వకుంట్ల కవిత దూరమే: కారణం అదేనా...

By telugu teamFirst Published Sep 27, 2019, 12:46 PM IST
Highlights

ఈసారి కూడా బతుకమ్మ సంబురాలకు కల్వకుంట్ల కవిత దూరంగా ఉంటారని తెలుస్తోంది. లోకసభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఓటమి పాలైన నేపథ్యంలో బతుకమ్మ సంబురాల్లో పాల్గొంటే విమర్శలు వస్తాయని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మాజీ పార్లమెంటు సభ్యురాలు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తనయ కల్వకుంట్ల కవిత ఈసారి బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారనే ప్రచారం ఇటీవల ప్రారంభమైంది. ఆమె బతుకమ్మ లోగోను ఆవిష్కరించడంతో ఈ ప్రచారం ఊపందుకుంది. నిరుడు బతుకమ్మ సంబురాలకు ఆమె దూరంగా ఉన్నారు. 

తిరుగులేదని భావించిన కవిత లోకసభ ఎన్నికల్లో అనూహ్యంగా నిజామాబాద్ స్థానంలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆమె ఎక్కువగా రాజకీయాల్లో ఉండడం లేదు. చాలా అరుదుగా కనిపిస్తున్నారు. ఈ స్థితిలో ఆమె తిరిగి బతుకమ్మ సంబురాలకు పూర్వ వైభవం తెస్తారని అందరూ భావించారు. 

అయితే, ఆమె బతుకమ్మ సంబురాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బతుకమ్మ గురించి ఆమె మీడియాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదని అంటున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆమె బతుకమ్మ సంబురాలను ఓ సాంస్కృతిక ఉద్యమంగా కొనసాగించారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో బతుకమ్మ సంబురాల్లో పాల్గొంటూ వచ్చారు. తద్వారా బతుకమ్మ అంటే కవిత అనే అభిప్రాయం బలపడిపోయింది. 

బతుకమ్మ సంబురాలకు, ఇతర తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఆమె తెలంగాణ జాగృతి అనే సంస్థను కూడా స్థాపించారు. నిరుడు బతుకమ్మకు దూరంగా ఉన్న నేపథ్యంలో ఈసారి పాల్గొంటే విమర్శలు వస్తాయని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిరుడు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున బతుకమ్మ సంబురాల నిర్వహణకు వీలు కాలేదనే అభిప్రాయం కూడా ఒకటి ఉంది. 

లోకసభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు కాబట్టి మళ్లీ బతుకమ్మను ఎత్తుకుంటున్నారనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి రావచ్చునని అనుకుంటున్నారు. అదే సమయంలో కేసీఆర్ ప్రభుత్వంపై కూడా విమర్శలు వచ్చే అవకాశాలున్నాయి. ఈ స్థితిలో బతుకమ్మ సంబురాలకు దూరంగా ఉండడమే మంచిదని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది.

click me!