హైదరాబాద్‌లో ఎన్నికల వేడి: ఓటేసిన వైసీపీ ఎమ్మెల్యే, జేసీ కుమారుడు

By Siva KodatiFirst Published Mar 21, 2021, 7:56 PM IST
Highlights

హైదరాబాద్ నగరంలో ప్రముఖులు, సంపన్నులు బాగా స్థిరపడిన ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో ప్రస్తుతం ఎన్నికల వేడి రాజుకుంది. ఏపీకి చెందిన తెలుగుదేశం, వైసీపీ నేతలు సైతం ఓటు హక్కు వినియోగించుకున్నారు

హైదరాబాద్ నగరంలో ప్రముఖులు, సంపన్నులు బాగా స్థిరపడిన ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో ప్రస్తుతం ఎన్నికల వేడి రాజుకుంది. ఏపీకి చెందిన తెలుగుదేశం, వైసీపీ నేతలు సైతం ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అదేంటి నిన్ననే కదా ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి.. మళ్లీ ఎలక్షన్స్ ఏంటీ, అందులోనూ ఏపీ నేతలు ఓట్లు వేయడం ఏంటీ అనుకుంటున్నారా. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతం 1,195 ఎకరాల్లో సొసైటీ విస్తరించి ఉంది.

ఈ సొసైటీ 5వేల మంది సభ్యులతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ కమిటీలో 15 మంది సభ్యులు ఉంటారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ కేటగిరిలో ఒకరు, మహిళా కేటగిరిలో ఇద్దరు, జనరల్ కేటగిరిలో 12 మంది సభ్యులు ఉంటారు.

 వీరి పదవీకాలం గతేడాదిలోనే ముగిసింది. అయితే సభ్యుల పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించారు. ఈ నేపథ్యంలోనే సొసైటీ ఎన్నికలకు మార్చి 3న నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందుకు సంబంధించి ఆదివారం పోలింగ్ జరిగింది. 

మొత్తం ఓట్లు 3,181కాగా, 1750 ఓట్లు పోలైనట్లుగా తెలుస్తోంది. సాయంత్రం 4గంలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించగా, రాత్రికి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఏపీ, తెలంగాణలతో సంబంధం లేకుండా జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ఉన్న ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఏపీకి చెందిన పలువురు ప్రముఖులు ఓటు వేశారు. వీరిలో వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, కేంద్ర మాజీమంత్రి పళ్లంరాజు, టీడీపీ నేతలు కంభంపాటి రామ్మోహనరావు, జేసీ పవన్ రెడ్డి, ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారు.

తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ వాణీదేవి, సినీ హీరోలు వెంకటేష్,  శ్రీకాంత్, త్రివిక్రమ్, నిర్మాత దిల్ రాజు, కేఎస్ రామారావు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

click me!