జూబ్లీహిల్స్ కారు ప్రమాదంలో ట్విస్ట్: కారు బోధన్ ఎమ్మెల్యే షకీల్ దే, పరారీలో డ్రైవర్

By Pratap Reddy KasulaFirst Published Mar 18, 2022, 12:46 PM IST
Highlights

హైదరాబాదులోని జూబ్లీపిల్స్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్త విషయాలు వెలుగు చూశాయి. బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్ ఉన్న కారు ఢీకొనడంతో మహిళ చేతిలోని పసికందు జారి పడి మరణించిన విషయం తెలిసిందే.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో జరిగిన కారు ప్రమాదానికి సంబంధించి కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాదం చేసిన కారు డ్రైవర్ గురువారం రాత్రి నుంచి పరారీలో ఉన్నాడు. కారు ఢీకొనడంతో మహిళ ఒడిలో ఉన్న రెండున్నర నెలల పసికందు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. మరో ముగ్గురు గాయపడ్డారు. మహారాష్ట్రకు చెందిన కాజల్ చౌహాన్ చేతిలో ఉన్న పసికందు జారిపడి మరణించాడు. మహారాష్ట్రకు చెందిన మహిళతో పాటు ఇతరులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ప్రమాదం చేసిన కారు తనది కాదని తొలుత బుకాయించిన నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ చివరకు ఆ కారు తనదేనని అంగీకరించారు. ప్రమాదం చేసిన కారుపై బోధన్ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. కారు తనదే అయినప్పటికీ ప్రమాదంతో తనకు ఏ సంబంధం లేదని షకీల్ చెప్పారు. తాను ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నట్లు తెలిపారు. కారు డ్రైవర్ మాత్రం పోలీసులకు చిక్కడం లేదు. 

షకీల్ డ్రైవర్ కారును నడిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ కారును నిజామాబాద్ మిర్జా ఇన్ ఫ్రా కంపెనీ పేర కొన్నాళ్ల క్రితం కొనుగోలు చేశారు. 15 రోజుల క్రితమే కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించినట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఎవరు కారును నడిపారు, కారు ఎంత వేగంతో ఉందనేది దర్యాప్తులో తేలుతుందని అన్నారు. 

బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మాదాపూర్ నుంచి టీఆర్ నెంబర్ తో ఉన్న కారు తీగల వంతెన మీదుగా జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45లోని వంతెన దాటి వేగంగా దూసుకుపోతన్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. వంతెన దాటగానే కారు అదుపు తప్పింది. 

పిల్లలను ఎత్తుకుని అక్కడ బుడగలు విక్రయిస్తున్న మహారాష్ట్రకు చెందన కాజల్ చౌహాన్, సారిక చౌహాన్, సుష్మ భోంస్లేలను కారు ఢీకొట్టింది. దీంతో కాజల్ చౌహన్ చేతిలో ఉన్న రెండున్నర నెలల పసికందు రణవీర్ వీర్ చౌహాన్, సారిక చేతుల్లో ఉన్న ఏడాది వయస్సున్న అశ్వతోష్ కింద పడ్డారు. రణవీర్ చౌహాన్ అపస్మారక స్థితిలోకి వెళ్లి మృత్యువాత పడ్డాడు. 

click me!