కమల దళంలోకి తీన్మార్ మల్లన్న?.. కారణాలు ఇవేనా?

By telugu teamFirst Published Sep 30, 2021, 8:13 PM IST
Highlights

క్యూన్యూస్ అధినేత, జర్నలిస్టు తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరబోతున్నట్టు వచ్చిన ప్రకటన రాష్ట్ర రాజకీయాలను మరో మలుపు తిప్పనున్నాయి. మల్లన్న బీజేపీలో చేరనున్నారని ఆయన సతీమణ ిమమత ప్రకటించినట్టు సమాచారం వచ్చింది. అదే నిజమైతే ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న బీజేపీకి ఆయన మరో అస్త్రంగా మారనున్నారు. టీఆర్ఎస్‌పై ఆయన ఆరోపణలు, తీవ్ర విమర్శల వెనుక బీజేపీ మద్దతు ఉన్నదనేది కొందరి అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే అటు రాజకీయంగా నిలదొక్కుకోవడానికి, ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్బంధాన్ని ఎదుర్కోవడానికి బీజేపీలో చేరడమే సముచితమని మల్లన్న భావించి ఉండవచ్చనేది విశ్లేషకుల మాట.
 

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంటున్నది. తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరనున్నట్టు ఆయన సతీమణి మమత ప్రకటించారు. అంతేకాదు, మల్లన్నను విడుదల చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆమె మెయిల్ చేసినట్టు తెలిసింది. క్యూన్యూస్ అధినేత, జర్నలిస్టు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కొంతకాలంగా అధికార పార్టీ టీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్‌లపై ఆయన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

జ్యోతిష్యుడి ఆత్మహత్యాయత్నానికి కారణమయ్యారంటూ తీన్మార్ మల్లన్నను చిలకలగూడ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసు నుంచి బెయిల్ వచ్చినా మరో కేసులో ఇంకా రిమాండ్‌లోనే ఉన్నారు. టీఆర్ఎస్‌పై కటువైన విమర్శలు, ఆరోపణలు చేస్తూ అప్పటికే జర్నలిస్టుగా పేరున్న ఆయన మరింత ఆదరణ సంపాదించుకున్నారు. ఆయన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. అటు టీఆర్ఎస్‌పై విమర్శలు, ఇటు రాజకీయంలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు సమాంతరంగా కొనసాగించారు.

టీఆర్ఎస్‌పై పదునైన విమర్శలతో ప్రాచుర్యం పొందిన ఆయనను తమ పార్టీలో చేర్చుకోవాలని ప్రతిపక్షపార్టీలు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ప్రయత్నాలు చేశాయి. కానీ, ఆయనకు బీజేపీ మద్దతు ఉన్నదనేది చాలా మంది అభిప్రాయం. ఆయన అరెస్టుపై, అరెస్ట్ అయ్యాక ఆయన వైపు నుంచి బలంగా బీజేపీ నేతలే ఎక్కువగా మాట్లాడుతున్నారు. బండి సంజయ్, వివేక్, అర్వింద్ సహా పలువురు బీజేపీ నేతలు తీన్మార్ మల్లన్నవైపు నిలబడ్డారు. అంతేకాదు, బీజేపీలో చేరితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వనున్నట్టు గతంలో ఆయనతో ఓ ప్రతిపాదన చేసినట్టు గుసగుసలు వినిపించాయి.

తనది ఏ పార్టీ కాదని, తెలంగాణ ప్రజల్లో చైతన్యం పెంచడమే లక్ష్యమని చెప్పిన తీన్మార్ మల్లన్న.. నిర్బంధం పెరుగుతుండటంతో పార్టీ అండ అవసరమనే భావం ఆయనలో ఏర్పడి ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. బహుశా అందుకే బీజేపీని ఎంచుకుని అందులోకి చేరాలనే నిర్ణయానికి వచ్చినట్టు కొందరు చెబుతున్నారు. కేంద్రంలోనూ బీజేపీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీలో చేరే ప్రకటనతోపాటే కేంద్రానికి లేఖ రాసినట్టూ తెలిసింది. తెలంగాణలోనూ బీజేపీ వేగంగా పుంజుకోవడమూ ఆయన నిర్ణాయినిక మరో కారణమై ఉండొచ్చని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో రాజకీయంగా ఎదగడానికి, వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న నిర్బంధాన్ని ఫేస్ చేయడానికి ఈ పార్టీలో చేరడం సరైన నిర్ణయమని భావించి ఉండవచ్చని చెబుతున్నారు.

అయితే, క్యూన్యూస్ ప్రారంభానికి ముందు నుంచే ఆయన బీజేపీవైపు ఉన్నారనే వాదనలూ ఉన్నాయి. ఆయన పత్రిక శనార్తి తెలంగాణలోనూ టీఆర్‌ఎస్‌పై బలంగా వాయిస్ వినిపించబోతున్నట్టు ఊహాగానాలున్నాయి. ఈ ప్రచారం జరుగుతుండగానే ఆయన బీజేపీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతున్నది.

click me!