తెలంగాణలో 21 కరోనా కేసులు, 24 గంటల జనతా కర్ఫ్యా: కేసీఆర్

By telugu teamFirst Published Mar 21, 2020, 3:56 PM IST
Highlights

రాష్ట్రంలో 21 కరోనా వైరస్ కేసులు నమోదైనట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ చెప్పారు. జనతా కర్ఫ్యూను రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి 6 గంటల వరకు పాటించనున్నట్లు ఆయనతెలిపారు.

హైదరాబాద్: తెలంగాణలో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పారు. జనతా కర్ఫ్యూను రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి 6 గంటల వరకు పాటించనున్నట్లు ఆయన తెలిపారు. అత్యవసర సేవలు తప్ప మిగతావన్నీ బంద్ అవుతాయని ఆయన శనివారం మీడియా సమావేశంలో చెప్పారు. 

విదేశాల నుంచి వచ్చినవారితోనే సమస్య ఎదురవుతోందని, దాదాపు 20 వేల మంది విదేశాల నుంచి వచ్చారని, విదేశాల నుంచి వచ్చిన వారు స్వయం నియంత్రణ పాటించాలని ఆయన అన్నారు. విదేశాల నుంచి వచ్చినవారు 14 రోజులు నియంత్రణలో ఉండేవిధంగా పర్యవేక్షణ చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. 700కి పైగా అనుమానితులున్నట్లు తెలిపారు. పరీక్షలు చేయిస్తున్నట్లు తెలిపారు. 

కరోనా పాజిటివ్ ఉన్నవాళ్లంతా విదేశాల నుంచి వచ్చినవాళ్లేనని ఆయన చెప్పారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో 52 చెక్ పోస్టులు పెట్టామని, 78 జాయింట్ ఇన్ స్పెక్షన్ ఏర్పాపటు చేశామని ఆయన చెప్పారు. విదేశాల నుంచి వచ్చినవాళ్లు తమ వాళ్లేనని, బయటక వెళ్లి కుటుంబాన్నీ సమాజాన్నీ చెడగొడుతున్నారని, దయచేసి వారు సహకరించాలని, స్వయంగా మీ అంతట మీరే రిపోర్టు చేసి పరీక్షలు చేయించుకోవాలని ఆయన అన్నారు. స్వయం నియంత్రణ పాటించాలని ఆయన అన్నారు. 

విదేశాల నుంచి వచ్చినవాళ్లు ఏదో ఒక చోటు రిపోర్టు చేయాలని, అలా చేయకపోతే అటువంటి వ్యక్తుల కుటుంబ సభ్యులు రిపోర్టు చేసే విధంగా చూడాలని ఆయన అన్నారు. తెలంగాణ దేశానికి ఆదర్శం కావాలని ఆయన అన్నారు. ఏ విధమైన పరిస్థితి ఎదురైనా తెలంగాణ ఎదుర్కోగదలదని నిరూపించాలని ఆయన అన్నారు. ఏదైనా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కావాల్సింది ప్రజల సహకారమేనని ఆయన అన్నారు. అవసరమైతే అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని కరోనాను ఎదుర్కుంటామని ఆయన చెప్పారు.

జనతా కర్ఫ్యూను పాటించి దేశానికి ఆదర్శంగా నిలువాలని ఆయన అన్నారు. రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఎల్లుండి ఆరు గంటల వరకు తెలంగాణలో జనతా కర్ఫ్యూ పాటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆర్టీసీ బస్సులు నడవవని, మెట్రో రైళ్లు ఉండవని ఆయన చెప్పారు. అత్యవసర సర్వీసుల కోసం డిపోలో ఐదు చొప్పున బస్సులు, ఐదు మెట్రో రైళ్లు సిద్ధంగా ఉంటాయని ఆయన చెప్పారు. పెట్రోల్ బంకులు తెరిచే ఉంటాయని చెప్పారు. 

స్వయం నియంత్రణ పాటించకుండా మొండికేస్తే పోలీసులు పట్టుకుంటారని ఆయన చెప్పారు. ఒక రోజులో మునిగిపోయేది ఏమీ ఉండదని, పూర్తి బంద్ పాటించాలని ఆయన అన్నారు. స్వయం నియంత్రణ పాటించని చోటనే ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు.

మన పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో ఎక్కువగా ఉందని, అక్కడి నుంచి మనకు పట్టుకునే అవకాశం ఉందని, దాంతో మహారాష్ట్ర సరిహద్దులను మూసేసే ఆలోచన చేస్తున్నామని ఆయన చెప్పారు. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు బంధుత్వాలున్నాయని ఆయన చెప్పారు.  రెండు రోజులు చూస్తామని, మహారాష్ట్రలో తీవ్రత పెరిగితే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పి సరిహద్దులు మూసేస్తామని చెప్పారు.

click me!