మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనవడు, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ మేనల్లుడు, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కొడుకు రాజారెడ్డి నిశ్చితార్థ శుభకార్యానికి జనసేనాని పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి నిశ్చితార్థం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ లో జరిగిన ఈ ఫంక్షన్ లో ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు. షర్మిల ఆహ్వానం మేరకు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ కూడా రాజారెడ్డి-అట్లూరి ప్రియ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు.
పవన్ రాక సందర్భంగా ఎంగేజ్మెంట్ ఫంక్షన్ లో ఒక్కసారిగా కోలాహలం ఏర్పడింది. ఆయనకు షర్మిల-అనిల్ దంపతులు స్వాగతం పలికారు. త్వరలోనే పెళ్ళి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించనున్న రాజారెడ్డి-ప్రియ జోడీకి పవన్ శుభాకాంక్షలు తెలిపారు. షర్మిల కుటుంబసభ్యులందరు పవన్ కల్యాణ్ తో కలిసి ఫోటోలు దిగారు.
Today attended son's Engagement function pic.twitter.com/7F4JK4ftJs
— Pawanism™ (@santhu_msd7)
ఇక సోదరి షర్మిల కుమారుడి నిశ్చితార్థ వేడుకకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా హాజరయ్యారు. భార్య భారతితో కలిసి ఈ ఫంక్షన్ కు హాజరైన జగన్ మేనల్లుడు రాజారెడ్డి, అతడికి కాబోయే భార్య ప్రియలను ఆశీర్వదించారు. అలాగే తల్లి విజయమ్మ, చెల్లిబావ షర్మిల, అనిల్ తో పాటు మేనకోడలిని జగన్ పలకరించారు. వైఎస్ భారతి కూడా కుటుంబసభ్యులను చిరునవ్వుతో పలకరించారు.
Also Read షర్మిల కుమారుడి ఎంగేజ్‌మెంట్‌కు హాజరైన వైఎస్ జగన్ , భారతి
రాజారెడ్డి-ప్రియ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కు ఏపీ, తెలంగాణకు చెందిన ఇతర రాజకీయ ప్రముఖులు సైతం హాజరయ్యారు. గతంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీకి, ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ కు అధ్యక్షురాలిగా వున్న షర్మిలకు ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులతో సత్సంబంధాలున్నాయి. దీంతో కొడుకు నిశ్చితార్థం, త్వరలోనే జరిగే పెళ్లికి రావాల్సిందిగా ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన రాజకీయ ప్రముఖులను స్వయంగా ఆహ్వానించారు షర్మిల. ఆమె ఆహ్వానాన్ని మన్నించి పవన్ కల్యాణ్ ఈ నిశ్చితార్థ ఫంక్షన్ కు హాజరయ్యారు.
అమెరికాలో ఎంఎస్ చదివుకుంటున్న షర్మిల తనయుడు రాజారెడ్డి తెలుగమ్మాయి ప్రియతో ప్రేమలో పడ్డాడు. గత నాలుగేళ్లుగా ప్రేమలో వున్న వీరు ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్దమయ్యారు. జనవరి 18న అంటే నిన్న గురువారం నిశ్చితార్థం జరుపుకున్న రాజారెడ్డి-ప్రియ జోడి ఫిబ్రవరి 17న పెళ్లిపీటలు ఎక్కనున్నారు.