సొంత వాహనం కూడా లేని మాజీ మంత్రి జానారెడ్డి..!

By telugu news teamFirst Published Mar 31, 2021, 8:30 AM IST
Highlights

నామినేషన్ లో భాగంగా ఆయన తన ఆస్తుల వివరాలను పొందుపొరిచారు. ఎక్కువకాలం మంత్రిగా పనిచేసిన జానారెడ్డి పేరున సొంత వాహనం కూడా లేదు. 

నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు తుది గడువు ముగిసింది. ఆఖరిరోజు వరకు ఎదురుచూసిన అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులతో నామినేషన్లు వేయించారు. తనకు పదవిపై వ్యామోహం లేదని, కేవలం రెండు మూడేళ్ల కోసం బరిలో దిగలేనని కొన్ని నెలల కిందట వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జానా రెడ్డి ఎట్టకేలకు నాగార్జన సాగర్ ఉప ఎన్నికల బరిలో నిలిచారు. నామినేషన్ చివరిరోజైన నేడు కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి జానారెడ్డి నామినేషన్ వేశారు. అందుకు సంబందించిన పత్రాలను సమర్పించారు. ప్రజాస్వామ్యబద్దంగా తాము ముందుకు వెళతామని జానారెడ్డి వ్యాఖ్యానించారు. 

నామినేషన్ లో భాగంగా ఆయన తన ఆస్తుల వివరాలను పొందుపొరిచారు. ఎక్కువకాలం మంత్రిగా పనిచేసిన జానారెడ్డి పేరున సొంత వాహనం కూడా లేదు. నివాస భవనాలూ లేకపోగా హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో 600 గజాల స్థలం (విలువ రూ.2,73,80,000) ఉంది. అలాగే ఆయన వద్ద రెండు లైసెన్స్‌డ్‌ తుపాకులు.. 32 బోర్‌ రివాల్వర్, 0.25 పిస్టల్‌ ఉన్నాయి.


జానాకు రూ.36,21,930 విలువైన చరాస్తి, రూ.33,46,000 విలువైన స్థిరాస్తి ఉంది. ఆయన భార్య సుమతికి ఏకంగా రూ. 5,13,16,724 విలువైన చరాస్తి ఉండగా, రూ.9,88,96,260 విలువైన స్థిరాస్తి ఉంది. జానా చేతిలో రూ.3,45,000 నగదు ఉండగా ఆయన భార్య చేతిలో రూ.2,75,000 నగదు ఉంది. జానాకు ఎస్‌బీఐ సెక్రటేరియట్‌ బ్రాంచ్‌లో రూ.4,89,626, యూకో బ్యాంక్, హైదరాబాద్‌లో రూ.1,67,776 నగదు ఉన్నాయి. భార్య పేరున యూకో బ్యాంక్, హైదరాబాద్‌లో రూ.6,81,012, ఎస్‌బీఐ సెక్రటేరియట్‌ శాఖలో రూ.8,83,336 నగదు ఉన్నాయి. 


జానారెడ్డి పేరిట ఆరతి ఎనర్జీ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో రూ.21,70,000 విలువైన ఈక్విటీ షేర్లు ఉండగా భార్య పేరున ఆస్థా గ్రీన్‌ ఎనర్జీ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లో రూ.3,85,74,560 విలువైన షేర్లు, ఆరతి ఎనర్జీ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో రూ.34,26,640 విలువైన షేర్లు, తరండా హైడ్రో పవర్‌ ప్రైవేట్‌లిమిటెడ్‌లో రూ.35,90,000 విలువైన
షేర్లు ఉన్నట్లు జానా ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

click me!