
హైదరాబాద్ : తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమున హేచరీస్ కు హైకోర్టులో ఊరట లభించింది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలోని ప్రభుత్వ భూమిని ఈ సంస్థ ఆక్రమించుకుందని రెవెన్యూ అధికారులు నిర్దారించి స్వాధీనానికి చర్యలు తీసుకున్నారు. అయితే దీనిపై జమునా హేచరీస్ హైకోర్ట్ ను ఆశ్రయించగా సర్వే నెంబర్ 130లోని జమునా హేచరీస్ కు చెందిన మూడెకరాల భూమి విషయంలో ఆగస్ట్ 1వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశిస్తూ హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అచ్చంపేటలో మూడెకరాల ప్రభుత్వ భూమిని జమునా హేచరీస్ సంస్థ ఆక్రమించుకుందని రెవెన్యూ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలోనే ఇటీవల మాసాయిపేట తహసీల్దార్ జమునా హేచరీస్ కు నోటీసులు జారీ చేసారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడంతో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై జమునా హేచరీస్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.
జమునా హేచరీస్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం జమునా హేచరీస్ కు ఊరటనిచ్చేలా మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అలాగే భూముల స్వాధీనానికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి, మెదక్ కలెక్టర్, ఆర్డివో, మాసాయిపేట తహసీల్దార్ లను న్యాయస్ధానం ఆదేశించింది.
read more కేసీఆర్ వచ్చి తనిఖీ చేసుకోవచ్చు.. ఒక గుంట కూడా కబ్జా చేయలేదు: ఈటల జమున ఫైర్
ఇక ఇటీవల జమునా హేచరీస్ ఆక్రమించుకున్నట్లు పేర్కొంటున్న అసైన్డ్ భూములను తిరిగి లబ్దిదారులకు పంపిణీ చేసారు అధికారులు. మాసాయిపేట మండలం హకీంపేట 97 సర్వేనంబర్ లో ఎకరం, అచ్చంపేట పరిధిలోని సర్వే నెంబర్ 77,8,79,80, 81, 82 సర్వే నంబర్లలోని 84ఎకరాల 19 గుంటల భూమిని జమునా హేచరీస్ ఆక్రమించుకున్నట్లు అధికారులు నిర్దారించారు. ఈ భూములను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి తిరిగి రైతులను అందచేసారు.
మెదక్, తూప్రాన్,నర్సాపూర్ ఆర్డీవోల సమక్షంలో పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. అయితే అధికారులు కొందరు రైతులకు చూపించిన హద్దుల్లో జమునా హేచరీస్ కు చెందిన శాశ్వత కట్టడాలు వున్నాయి. ఈ భూమిలో తాము వ్యవసాయం ఎలా చేసుకోవాలంటూ రైతులు అయోమయం చెందుతున్నారు. అధికారులు ఆ నిర్మాణాలను తొలగించి వ్యవసాయానికి అనుకూలంగా భూమిని మార్చాలని రైతులు కోరుతున్నారు.
ఇక తమ భూములను ప్రభుత్వం పంపిణీ చేయడంపై ఎమ్మెల్యే ఈటల సతీమణి జమున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. తాము ఒక్క గుంట భూమికూడా కబ్జా చేయలేదని... కావాలంటే స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో వచ్చి భూములపై విచారణ చేపట్టాలన్నారు. తాము భూమిని కబ్జా చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాయడానికి సిద్దంగా వున్నట్లు జమున తెలిపారు. అంతేగాని ప్రతిసారీ గారడి చేసి తాము భూములు కబ్జా చేసినట్లు అబద్దాలు ప్రచారంచేస్తూ కేసీఆర్ గారడీ రాజకీయాలు చేయడం తగదని హెచ్చరించారు.
జమునా హేచరీస్ కు చెందిన భూముల సర్వే నంబర్లకు.. అధికారులు ఇచ్చన భూముల సర్వే నంబర్లకు ఎటువంటి పొంతన లేదని జమున అన్నారు. తమకు 50 నుంచి 60 ఎకరాల భూమి ఉంటే 80 ఎకరాలు ఎలా చూపిస్తున్నారని ప్రశ్నించారు. తమ భూములను కేసీఆర్ అక్రమించుకోవాలని చూస్తున్నట్లున్నాడని జమున కామెంట్ చేశారు.