
రాహుల్ గాంధీ నైట్ క్లబ్‌లో ఉన్న వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. రాహుల్ గాంధీ ఫంక్షన్‌కు వెళ్లారని చెప్పారు. వైరల్ చేస్తున్న వీడియోలో అభ్యంతరం ఏముందని ప్రశ్నించారు. పిలిస్తే ఫంక్షన్‌కు వెళ్తాం.. అక్కడ ఏం జరుగుతుందో మనకెళా తెలుస్తోందని అన్నారు. ఫంక్షన్‌కు వెళ్ళిన చోట ఏముందో రాహుల్ గాంధీకి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. అక్కడ జరిగేదానికి రాహుల్ గాంధీకి ఏం సంబంధం అని అన్నారు. ఏదెదో ఊహించుకుని ప్రచారం చేస్తే ఎలా మండిపడ్డారు. ఇలా అసత్యాలు ప్రచారం చేసే మూర్ఖులకు ఏం చెప్తామని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ బహిరంగంగానే ఫంక్షన్‌కు వెళ్లాడని చెప్పారు.
బీజేపీ, టీఆర్‌ఎస్‌లది చిల్లరగా వ్యవహరిస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. పెళ్లికి వెళ్లిన వీడియోని చూపిస్తూ రాజకీయం చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిల్లర రాజకీయాలు మానాలని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మీద.. తాను కెమెరాలు పెట్టాలా అంటూ ఫైర్ అయ్యారు. ఆ రెండు పార్టీలలో రాత్రిపూట తిరిగే లీడర్లు లేరా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ లీడర్లకు హయత్ హోటల్‌లో రూమ్‌లు ఉన్నాయని ఆరోపించారు. వారి పేర్లు చెబితే బాగుండదని చెప్పారు. రాత్రిపూట హోటల్ సూట్లలో తందనాలు ఆడట్లేదా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఫంక్షన్‌కు ఇంత రాద్దాంతం చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు.
ఇక, రాహుల్ గాంధీ తెలంగాణ టూర్‌పై టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడంపై జగ్గారెడ్డి స్పందించారు. కాంగ్రెస్ ఏం చేసిందని టీఆర్ఎస్ అడుగుతుందని.. అలా మాట్లాడే ముందు చరిత్ర తెలుసుకోవాలని సూచించారు. ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ అని.. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం పది పైసల పనిచేసి.. వంద రూపాయల ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్‌ది గ్రాఫిక్స్ పాలన అని విమర్శించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసమే రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారని చెప్పారు. ఓయూ పర్యటనపై కార్యచరణ ఉంటుందన్నారు. రైతులను ముంచడంలో కేసీఆర్, మోదీ అన్నదమ్ములే అని విమర్శించారు. ఈ నెల 6న జరిగే రైతు సంఘర్షణ సభకు రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఇక, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నైట్ క్లబ్‌లో ఉన్న వీడియో ఈ రోజు ఉదయం నుంచి తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోను షేర్ చేసిన బీజేపీ నేతలు.. రాహుల్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడతున్నాయి. మరోవైపు సంక్షోభంలో ఉన్న కాంగ్రెస్‌ను పట్టించుకోకుండా.. రాహుల్ గాంధీ పార్టీలో ఎంజాయ్ చేస్తున్నారని పలువురు విమర్శలు చేస్తున్నారు. కీలక సమయాల్లో పార్టీని పట్టించుకోకుండా రాహుల్ ఈ రకమైన టూర్‌లకు వెళ్లడం కొత్తేమీ కాదనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.
రాహుల్ గాంధీ వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కాంగ్రెస్ సీనియర్ నేత Randeep Surjewala మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఫ్రెండ్ పెళ్లి కోసం రాహుల్ గాంధీ నేపాల్ వెళ్లాడని తెలిపారు. ఫ్యామిలీ కార్యక్రమాల్లో పాల్గొనడం నేరం కాదని అన్నారు. ప్రధాని మోదీలాగా రాహుల్ ఆహ్వానం లేని అతిథిగా పాకిస్థాన్‌కు వెళ్లలేదని బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కానీ రాహుల్ గాంధీ ప్రైవేట్ వివాహ కార్యక్రమంలో పాల్గొనడానికి మిత్రదేశమైన నేపాల్‌కు వెళ్లారని చెప్పారు.