తెలంగాణలో ‘‘ఆ ఒక్కటి అడగొద్దట’’

Published : Sep 05, 2017, 04:00 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
తెలంగాణలో ‘‘ఆ ఒక్కటి అడగొద్దట’’

సారాంశం

తెలంగాణ నిరుద్యోగుకు సర్కారు మొండిచేయి పట్టించుకోని టిఆర్ఎస్ సర్కారు ఏండ్ల సంది ఎదరుచూస్తున్న నిరుద్యోగులు లేని వివాదాలను ముందలేసుకుంటున్న సర్కార్

తెలంగాణ సర్కారు గొర్రెల పంపినీ, బర్రెల పంపిణీ, చేపల పంపిణీ, చీరల పంపిణీలో బిజి బిజిగా ఉంది. అధికారులు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులంతా ఈ పనుల్లో బిజీ అయిపోయారు. కానీ తెలంగాణ నిరుద్యోగులు అడిగేది మాత్రం చేయడానికి సర్కారు పూనుకోవడంలేదు. ఇంతకూ నిరుద్యోగులు అడిగేదేంటి? సర్కారు ఇయ్యకుండా ఆపుతున్నదేంటో అని సందేహం వచ్చిందా అయితే ఈ స్టోరీ చదవండి.

దశాబ్దాలుగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగుల బతుకులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. తెలంగాణ వచ్చింది.. ఎక్కాల్సిన వాళ్లు గద్దెనెక్కిర్రు కానీ మాకు ఉద్యోగాలు మాత్రం రాలేదని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. నిరుద్యోగులుగా మేము సాధించినదేంటంటే ‘ఏజ్ బార్’ మాత్రమే అని బాధపడుతున్నారు.  

నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్ లైన్ అని చెప్పి రాష్ట్రం తెచ్చుకుంటే నియామకాల విషయంలో సర్కారు పెద్దలు దాగుడుమూతలు ఆడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. తెలంగాణ సాధన కోసం నాడు వందల  సంఖ్యలో బలిదానాలు చేసుకున్నారు యువతీ యువకులు. కానీ నేడు తెలంగాణ సర్కారు పెద్దల వైఖరి కారణంగా కొత్త రకం బలిదానాలు మొదలవుతున్నాయి. మొన్నటికి మొన్న డిఎస్సీ కోసం రామకృష్ణ అనే యువకుడు ఆత్మబలిదానం చేసుకున్నాడు. తర్వాత ఖమ్మం జిల్లాలో మరో యువకుడు బలిదానం చేసుకున్నాడు.

ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయంలో తెలంగాణ సర్కారు పాశవికంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో చివరి రెండేళ్లు టీచర్ పోస్టుల భర్తీ జరగలేదు. అయితే తెలంగాణ స్వరాష్ట్రంలో మూడేళ్లు గడుస్తున్నా ఒక్కటంటే ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు. దీంతో బిఇడి, డిఇడి చేసి టెట్ అర్హత సాధించిన లక్షలాది మంది యువత బతుకులు అయోమయంలో పడిపోయాయి.

టీచర్ ఉద్యోగం వస్తేనే ఇంటకొస్తానంటూ కోటింగ్ ల కోసం హైదరాబాద్ లో కాలు పెట్టిన వారు ఇంటికి వెళ్లలేక, ఇక్కడ ఉండలేక నరకయాతన అనుభవిస్తున్నారు. ఇంకొందరైతే టీచర్ ఉద్యోగం వచ్చే వరకు పెళ్లి చేసుకోనని భీష్మించి కూర్చున్నారు. వాళ్లంతా ఉద్యోగానికే కాదు పెళ్లికి కూడా ఏజ్ బార్ అయిపోతోందోని బాధపడుతున్నారు.

మరి తెలంగాణ వచ్చిందే నీళ్లు, నిధులతోపాటు నియామకాల కోసం కదా? మరి అలాంటి తెలంగాణలో నియామకాలు  ఏవీ అని నిరుద్యోగులు నిలదీస్తున్నారు. గొర్లు, బర్లు, చీరలు, అంగీలు, లాగులు పంచుతూ సన్మానాలు, దావతలు చేసుకుంటున్న పాలకులు ఉద్యోగాల కల్పనపై మాత్రం కపటనాలకాటు ఆడుతున్నారని నిరుద్యోగులు మండిపడతున్నారు.

స్వరాష్ట్రంలో ఉద్యోగాల జాతర సాగుతుందని, వేలాది ఉద్యోగాలు నింపుతారని ఎదరుచూసిన వారికి చేదు అనుభవమే మిగులుతోంది. త్వరలో డిఎస్సీ అని, త్వరలో గ్రూప్స్ ఉద్యోగాలు అని పాకల పెద్దలు తీపి మాటలు చెబుతుంటే ఆశపడ్డ నిరుద్యోగులంతా అప్పులు సప్పులు చేసి కోచింగ్ సెంటర్లలో వాలిపోతున్నారు. తీరా నానా రకాల కొర్రీలతో నోటిఫికేషన్లు జారీ చేస్తుండడంతో న్యాయస్థానాలు మొట్టికాయలేస్తున్నాయి. అయినా పాలకుల తీరు మారడంలేదు.

మాట తప్పిన మంత్రి కడియం

కడియం శ్రీహరి ఉమ్మడి రాష్ట్రంలోనే సమర్థవంతమైన మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో ఆయన విద్యాశాఖ, భారీ నీటిపారుదల శాఖల మంత్రిగా సమర్థంగా పనిచేశారు. అందుకే ఆయన ఎంపిగా ఉన్న సమయంలో రాజీనామా చేయించి మంత్రిని చేసి ఎమ్మెల్సీని చేశారు కేసిఆర్. ఆయన వచ్చి విద్యాశాఖను గాడిలో పెడతారనుకుంటే ఏమాత్రం మెరుగు కాలేదని నిరుద్యోగులు చెబుతున్నారు. టెట్ ఫలితాలు వచ్చిన వెంటనే డిఎస్సీ ప్రకటిస్తామంటూ గంభీర ప్రకటన చేశారు కడియం. కానీ ఆయన ఆచరణలో మాట నిలబెట్టుకోలేకపోయారు.

ఉమ్మడి రాష్ట్రంలో మంచినీళ్లు తాగినంత సులువుగా ఉపాధ్యాయ నియామకాలు జరిగినయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో మూడేళ్ల కాలంగా టీచర్ పోస్టుల భర్తీ అనేది ఎందుకు జరుతలేదో అంతుచిక్కడంలేదని నిరుద్యోగులు అంటున్నారు. ఉత్త పుణ్యానికి కొత్త జిల్లాలు పాత జిల్లాలు అంటూ వివాదం, జోన్ల పేరుతో వివాదం ఇలా రకరకాల పేర్లతో లేని వివాదాలను ప్రభుత్వమే సృష్టించి డిఎస్సీ జరపడంలేదని మండిపడుతున్నారు నిరుద్యోగులు.

ఒకవైపు సుప్రీంకోర్టు తిడుతున్నా, ఛీకొడుతున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్నది ప్రభుత్వం. తెలంగాణ వచ్చిన మూడేళ్ల కాలంలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్త చేయని కారణంగా ఉపాధ్యాయులు లేని పాఠశాలలు దర్శనమిస్తున్నాయి. అలాంటి పాఠశాలలకు పిల్లలు ఎలా వస్తారని నిరుద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో టీచర్ పోస్టుల భర్తీ డిమాండ్ తో నిరుద్యోగ జెఎసి పాదయాత్ర చేపడుతోంది. మెగా డిఎస్సీ కోసం మహా పాదయాత్రకు ప్లాన్ చేశారు. దీంతోపాటు వచ్చే నెలలో తెలంగాణ జెఎసి కూడా భారీ బహిరంగ సభను హైదరాబాద్ లో జరపాలని సంకల్పించింది. మరి ఈ ఆందోళనలతోనైనా సర్కారులో ఏమైనా చలనం వస్తుందో లేదో చూడాలి.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

 

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.