Rahul Gandhi Telanagana tour: రైతు సంఘర్షణ సభ కాదు.. కాంగ్రెస్ అంతర్గత సంఘర్షణ సభ: మంత్రి తలసాని విమర్శలు

Published : May 07, 2022, 03:31 PM IST
Rahul Gandhi Telanagana tour: రైతు సంఘర్షణ సభ కాదు.. కాంగ్రెస్ అంతర్గత సంఘర్షణ సభ: మంత్రి తలసాని విమర్శలు

సారాంశం

రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. వరంగల్‌లో కాంగ్రెస్ నిర్వహించిన సభ కేంద్రంగా ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు సంధించారు. అది రైత సంఘర్షణ సభ కాదని, కాంగ్రెస్ నేతల అంతర్గత సంఘర్షణ సభ అని విమర్శించారు. ఆ సభలో ప్రకటించిన డిక్లరేషన్‌పైనా విమర్శలు కురిపించారు.  

హైదరాబాద్: రాహుల్ గాంధీ హాజరై ప్రసంగించిన రైతు సంఘర్షణ సభపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతలపై ఆయన ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ ప్రభాకర్, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్‌లతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్‌పై స్పష్టత లేదని అన్నారు. అది రైతు సంఘర్షణ సభ కాదని, కాంగ్రెస్ నేతల అంతర్గత సంఘర్షణ సభ అని వ్యంగ్యం పలికారు.

వరంగల్ సభలో కాంగ్రెస్ డిక్లరేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ డిక్లరేషన్‌లో భాగంగా రైతులపై హామీల జల్లు కురిపించింది. అయితే, ఈ డిక్లరేషన్ రాష్ట్రానికి సంబంధించినదా? దేశానికి సంబంధించినదా అనేది స్పష్టత లేదని తలసాని అన్నారు. అసలు వరంగల్ సభలో కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్ ఆచరణకు సాధ్యం కానిదని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ ఎంత? ఆ హామీల అమలుకు అయ్యే ఖర్చు ఎంత? ఈ విషయంపైనా అయినా కాంగ్రెస్ నేతలకు స్పష్టత ఉన్నదా అని పేర్కొన్నారు. అంతేకాదు, సభ కోసం వచ్చిన రాహుల్ గాధీ కేవలం పార్ట్ టైం పొలిటీషియన్ అని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే సాగు లాభసాటిగా మారిందనే విషయం గుర్తుంచుకోవాలని తలసాని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాగు నీటికి కృషి, రైతుల సంక్షేమ పథకాలను ఒకసారి తరచి చూడాలని పేర్కొన్నారు. కానీ, 60 ఏళ్లు దేశంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పగలదా? అని కౌంటర్ వేశారు. నిజంగా రైతులపై కాంగ్రెస్ పార్టీకి ప్రేమ ఉంటే.. సాగు చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో ధర్నాకు దిగిన రైతులకు మద్దతుగా ఎందుకు నిలువలేదని నిలదీశారు. రైతులు ధర్నా చేస్తుంటే కాంగ్రెస్ నేతలు ఎక్కడికి పోయారని అడిగారు.

పదే పదే తెలంగాణ రాష్ట్రం ఇచ్చామని కాంగ్రెస్ నేతలు పేర్కొంటూ ఉంటారని, కానీ, వారు ఒక విషయం గుర్తుంచుకోవాలని తలసాని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు చేసిన పోరాటానికి తలొగ్గే తెలంగాణ రాష్ట్రం ఇచ్చారనే విషయాన్ని మరువరాదని వివరించారు. అంతేకాదు, రైతుల పోరాటంతోనే కేంద్రం అది తెచ్చిన నల్ల చట్టాలను వెనక్కి తీసుకుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదని, ఇప్పటికే ఎంతో అభివృద్ధిని సాధించిందని పేర్కొన్నారు.

ఇదే సందర్భంలో ఆయన బీజేపీపైనా విమర్శలు గుప్పించారు ఢిల్లీ నుంచి నేతలు రాష్ట్రానికి టూరిస్టులుగా వచ్చి వెళ్తుంటారని విమర్శించారు. కానీ, వారితో ప్రజలకు ఒరిగేదేమీ లేదని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఎన్ని ఎకరాల భూమి సాగు అవుతుందో చర్చకు, పరిశీలనకు బీజేపీ నేతలు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఆరుగాలం రైతులు శ్రమించి పండించిన పంటను కేంద్రం కొనుగోలు చేయడం మానేయడంతో రాష్ట్రమే కొంటున్నదని పేర్కొన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu