మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో సోదాలు: అర్థరాత్రి హైడ్రామా, పోలీసులకు ఫిర్యాదులు

By Pratap Reddy KasulaFirst Published Nov 24, 2022, 7:31 AM IST
Highlights

మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో ఐటి సోదాలు ముగిశాయి. ఇందుకు సంబంధించి బుధవారం అర్థరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. మల్లారెడ్డి ఐటి అధికారులతో వాగ్వాదానికి దిగారు.

హైదరాబాద్: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువులు ఇళ్లలో, ఇతర ఆవరణల్లో ఆదాయం శాఖ అధికారుల సోదాలు ముగిశాయి. బుధవారం రాత్రి ఐటి అధికారులు తమ సోదాలను ముగించారు. సోదాలు ముగించి మల్లారెడ్డి కుమారుడితో పంచనామాపై సంతకం చేయించుకున్నారు. బుధవారం అర్థరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. ఐటి అధికారులకు, మంత్రి మల్లారెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో బుధవారం రాత్రి మల్లారెడ్డి హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి కుమారుడి నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఐటి అధికారి రత్నాకర్ ను బోయిన్ పల్లి పోలీసు స్టేషన్ కు తీసుకుని వెళ్లి ఆయనపై ఫిర్యాదు చేశారు. 

వైద్య కళాశాలలకు మూడేళ్లలో వంద కోట్ల రూపాయల విరాళాలు తీసుకున్నట్లు తన కుమారుడితో బలవంతంగా సంతకం చేయించుకున్నారని మల్లారెడ్డి బోయిన్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డిపై ఐటి అధికారులు దిండిగల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ అధికారిని మల్లారెడ్డి నిర్బంధించారని, ల్యాప్ టాప్ కూడా అతని నుంచి లాక్కున్నారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో 65 టీమ్ లతో 400 మంది అధికారులు రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.10 కోట్ల 50 లక్షల రూపాయలను ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి నివాసంలో మూడు కోట్ల రూపాయలను, కీలక పత్రాలను వారు స్వాధీనం చేసుకున్యనారు. అయితే, తమ వద్ద డబ్బులు ఏమీ దొరకలేదని మల్లారెడ్డి అంటున్నారు. ఐటి అధికారులు దౌర్జన్యం చేశారని, ఇంత దౌర్జన్యం గతంలో ఎప్పుడూ జరగలేదని ఆయన అన్నారు. ఐటి అధికారులను ఆయన రక్త పిశాచులుగా అభివర్ణించారు.

మర్రి రాజశేఖర్ రెడ్డి నివాసంలో మాత్రం ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. రాజశేఖర రెడ్డి టర్కీ నుంచి హైదరాబాద్ వస్తున్నారు. కాగా, సోమవారం నుంచి ఐటి అధికారులు విచారణ చేపట్టనున్నారు. విచారణకు హాజరు కావాలని కొంత మందికి నోటీసులు ఇచ్చారు. 
 

click me!