
హైదరాబాద్ లో ఏపీ సీఎం చంద్రబాబుకి ఐటీ ఉద్యోగుల నుంచి అనూహ్య స్పందన లభించింది. బుధవారం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో కలిసి చంద్రబాబు అమీర్ పేటలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న సంగతి తెలిసిందే.
కాగా.. అక్కడ‘‘వి లవ్ చంద్రబాబు. వి మిస్ యూ చంద్రబాబు. మీ వల్లే మేం ఇక్కడ ఉన్నాం’’.. అంటూ పలువురు ఐటీ ఉద్యోగులు ప్లాకర్డులు ప్రదర్శించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సులో రాహుల్‌తో కలిసి చంద్రబాబు సభ వద్దకు వచ్చారు. ఇద్దరూ కలిసి ఒకేసారి వేదిక ఎక్కారు. రాహుల్, ఇతర నేతలతో కలిసి చంద్రబాబు అభివాదం చేసిన సందర్భంగా కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. నేతలు తమ ప్రసంగాల్లో చంద్రబాబు పేరును ప్రస్తావించినప్పుడల్లా యువకులు, కార్యకర్తలు, ఐటీ ఉద్యోగులు ఉత్సాహంగా కేరింతలు కొట్టారు.
చంద్రబాబు ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధికి ఎంతగానే కృషి చేశారు. ఈ సందర్బంగానే ఐటీ ఉద్యోగులు ఇలా ప్లాకార్డులతో మళ్లీ తమకు టీడీపీ అధికారంలోకి రావాలని కాంక్షించారు.