
బాసర : తెలంగాణలోని ప్రముఖ దేవాలయాల అభివృద్దికి కేసీఆర్ సర్కార్ పూనుకుంది. ఇప్పటికే భారీ నిధులు ఖర్చుచేసి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దింది ప్రభుత్వం. ఇదే తరహాలో మరికొన్ని ఆలయాలను కూడా ఆద్యాత్మికత ఉట్టిపడేలా పున:నిర్మాణం చేపడామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు చదువులతల్లి సరస్వతి అమ్మవారు వెలిసిన బాసర ఆలయ పున:నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
బాసర ఆలయాన్ని సకల హంగులతో సర్వాంగ సుందరంగా నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పున:నిర్మాణ పనులకు ఇవాళ దేవాదాయ శాఖ మంత్రి ఆల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అమ్మవారి ఆలయానికి విచ్చేసిన మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ పున:నిర్మాణ పనులకు అంకురార్ఫణ చేసారు.
సరస్వతి అమ్మవారు కొలువైన గర్భాలయాన్ని పున:నిర్మించడంతో పాటు చుట్టుపక్కల అభివృద్ది పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వం రూ.50కోట్ల నిధులను కేటాయించింది. ఈ నిధుల్లోంచి రూ.8 కోట్లు ఖర్చుచేసి ఇప్పటికే ఆలయ పరిసరాల్లో విశ్రాంతి భవనాల నిర్మాణం, పలు పనులు చేపట్టారు.
వీడియో
ఇక ఆలయ అభివృద్దిలో అతి కీలకమైన గర్భాలయ పున:నిర్మాణానికి తాజాగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డి భూమిపూజ చేసారు. రూ.22 కోట్లతో ఇప్పుడున్న గర్భాలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్దం చేసారు. కృష్ణశిలలతో గర్భాలయాన్ని అత్యద్భుతంగా నిర్మించనున్నారు. అంతేకాదు ఆలయ పరిసరాలను కూడా ఎంతో అందంగా తీర్చిదిద్దనున్నారు. ఇక ఆలయ సమీపంలోని గోదావరి తీరంలో కూడా పలు అభివృద్ది, సుందరీకరణ పనులు చేపట్టనున్నారు.
గర్భాలయ భూమిపూజ కార్యక్రమంలో స్వయంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పలుగు పార పట్టి మట్టిని తవ్వారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ గర్భాలయ పున:నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి విజయరామారావు, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.